వాషింగ్టన్ : ప్రపంచ వింతల్లో ఒకటిగా ప్రఖ్యాతిగాంచిన, ప్రేమకు చిహ్నంగా పేరొందిన తాజ్‌మహల్‌ను అమెరికన్ ప్రభుత్వం విదేశీయుల పట్ల తమ విద్వేషాన్ని ప్రదర్శించేందుకు వినియోగించుకుంటున్నది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని తరిమివేసేందుకు యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ (డీహెచ్ఎస్) ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నది.
అక్రమంగా నివసిస్తున్న వారు తమంతట తాము ముందుకొచ్చి దేశం వదిలి వెళ్లేందుకు సిద్ధపడితే వారికి విమాన టికెట్‌తోపాటు కొంత నగదు కూడా అందిస్తున్నది. ఇందుకోసం డీహెచ్ఎస్ రూపొందించిన పోస్టర్ మీద తాజ్‌మహల్‌తోపాటు చైనా, కొలంబియా దేశాలకు చెందిన మరికొన్ని చిత్రాలను ముద్రించింది. తమంతట తాముగా దేశం వదిలి వెళ్లేవారికి విమాన టికెట్‌తోపాటు 2,600 డాలర్ల నగదు (సుమారు రూ.2.41 లక్షలు) అందిస్తామని తెలిపింది. అమెరికాలో సుమారు 7.25 లక్షల మంది భారతీయులు సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్నట్టు వెల్లడైంది.