RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు.. తన మంత్రివర్గ సభ్యుల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారని తెలిపారు. మంత్రుల ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సౌత్‌ఫస్ట్ పత్రిక నిజాలు బయటపెట్టిందని పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులు సరదాగా చేసుకున్న సంభాషణను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ఆ సంభాషణకు సంబంధించి ఓ మంత్రిని పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు హోంమంత్రి కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ సపోర్ట్ ఇస్తుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుతో సంభాషణకు సంబంధించి ఢిల్లీలో ఓ జర్నలిస్టును సీఎం నిలదీశారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే హరీశ్‌రావుకు జర్నలిస్టుకు మధ్య జరిగిన సంభాషణ ముఖ్యమంత్రికి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. పంజాగుట్ట పీఎస్ 243 కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతుండగా.. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పారు. తనకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 14న నోటీసు వచ్చిందని తెలిపారు. కానీ ఏడో తేదీనే ఆంధ్రజ్యోతి పత్రిక ఆ నోటీసుల గురించి రాసిందని చెప్పారు. విచారణ వివరాలు ఆంధ్రజ్యోతి పత్రికకు ముందే ఎలా తెలుస్తున్నాయని నిలదీశారు. అసలు ఆంధ్రజ్యోతి రన్నింగ్ కామెంటరీ ఏంటని ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ జాబితాను సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టుకు ఇవ్వాలి
రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌లో మోదీ, అమిత్‌షాలు కూడా భాగస్వాములేనన్న అనుమానం కలుగుతోందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. రాహుల్ గాంధీ, ఏఐసీసీ సభ్యుల ఫోన్లు కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయిస్తున్నారేమో అన్న అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. పారదర్శకత, చట్టం ప్రకారమే వ్యవహరిస్తున్నామని సీఎం చెబుతున్నారని, ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారో.. సీల్డ్ కవర్లో పెట్టి హైకోర్టులో సమర్పించాలని డిమాండ్ చేశారు. టెలీగ్రాఫ్ చట్టం ప్రకారం ఎవరిఫామ్లు ట్యాప్ చేస్తున్నారో మానిటర్ చేసేందుకు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, హైకోర్టు న్యాయమూర్తి, సంబంధిత అధికారులతో కమిటీ వేయాలన్నారు. టెలిగ్రాఫ్ చట్టం ఐదో సెక్షన్ ప్రకారం దేశ భద్రతకు సంబంధించి అనివార్యమైతే ఫోన్ ట్యాప్ చేయవచ్చని వివరించారు.
హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై ప్రతీకారంతో రగిలిపోతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో ప్రతీకార పాలన నడుస్తోందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్‌పై బీఆర్ఎస్కు నమ్మకం లేదని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ విచారణను సీబీఐకి అప్పగించాలని.. ఈ కేసుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై ఆధారపడకుండా ప్రైవేటు స్పై ఏజెన్సీలతో సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను రేవంత్ రెడ్డి వాడుకున్నట్లు కూడా అనుమానాలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్తారని రేవంత్ రెడ్డి అంటున్నారని.. కానీ రేవంత్ చేస్తున్న అక్రమాలకు ఆయన త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని త్వరలో గవర్నర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు.