Telangana | సంగారెడ్డి, మే 22(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో కాలుమోపకముందే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన విమర్శల పాలవుతున్నది. బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన అభివృద్ధి పనులను శుక్రవారం జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. కేసీఆర్ హయాంలో పూర్తయిన పనులు తాము పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభోత్సవాలకు పూనుకోవడం చర్చనీయాంశం అవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటుతున్నా సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయలేదు. ఇప్పుడు తన పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి రూ.100 కోట్లతో నిర్మించిన నిమ్జ్ రోడ్డు, రూ.100 కోట్లతో జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. హుగ్గెళ్లి చౌరస్తాలో మహాత్మ బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఝరాసంగం మండలంలోని మాచునూరులో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఈ పనులన్నీ బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే ప్రారంభమై, పూర్తయినవి కావడం గమనార్హం.
జహీరాబాద్ నియోజకవర్గంలోని ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో నిమ్జ్(జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి) ఏర్పాటైంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే నిమ్జ్ ఏర్పాటు కోసం భూసేకరణ చేశారు. నాడే పరిశ్రమల ఏర్పాటు ప్రారంభం అయ్యింది. పరిశ్రమలు సులువుగా తమ ఉత్పత్తులను తరలించేందుకు వీలుగా కేసీఆర్ సర్కార్ నిమ్జ్ నుంచి ముంబయి జాతీయ రహదారిని అనుసంధానం చేసేందుకు రూ.100 కోట్లతో రోడ్డు మంజూరు చేసింది. ఝరాసంగం మండలంలోని బర్ధిపూర్ నుంచి హుగ్గెళి వరకు 9.5 కిలోమీటర్ల మేర రెండు వరుసల రోడ్డు నిర్మాణం కోసం రూ.100 కోట్ల నిధులు విడుదల చేసింది. నాడే 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ పనులనే సీఎం రేవంత్ శుక్రవారం ప్రారంభించనున్నారు.
కేసీఆర్ సర్కారులోనే ఝరాసంగం మండలం మాచునూరు గ్రామానికి కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. తొలుత తాత్కాలిక భవనంలో ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయానికి సొంతభవనం కోసం కేసీఆర్ సర్కారు భూమిని కేటాయించింది. మాచునూరులో విద్యాలయ భవనం నిర్మాణం కోసం కేసీఆర్ హయాంలోనే పనులు ప్రారంభమయ్యాయి. గతేడాది అక్టోబర్‌లో కేంద్రీయ విద్యాలయం ఈ భవనంలోకి మారింది. తాజాగా ఈ విద్యాలయాన్నే సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలోనే కేసీఆర్ జహీరాబాద్ ప్రాంత అభివృద్ధి అంశాన్ని తన ప్రసంగాల్లో పదేపదే ప్రస్తావించేవారు. ఆంధ్రపాలకుల హయాంలో జహీరాబాద్ ప్రాంతం అభివృద్ధికి దూరమైందని తెలంగాణ అవిర్భావం తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని కేసీఆర్ చెప్పేవారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత జహీరాబాద్ ప్రాంత అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట వేశారు. నిమ్జ్ భూసేకరణ, పరిశ్రమల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ‘సంగమేశ్వర ఎత్తిపోతల’ పథకానికి శ్రీకారం చుట్టారు. రూ. 2653 కోట్ల వ్యయంతో ప్రనులు ప్రారంభించారు. జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాల పరిధిలో ఉన్న 231 గ్రామాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ ఎత్తిపోతల పథకానికి మల్లన్నసాగర్ నుంచి 12 టీఎంసీల నీటి వాటాను కేటాయించారు. అలాగే 113 మెగావాట్ల విద్యుత్‌ను కేసీఆర్ సర్కార్ కేటాయించింది.
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం 6727 ఎకరాల భూసేకరణ చేసేందుకు కేసీఆర్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నిర్మాణం పనుల కోసం టెండర్లు నిర్వహించి నిర్మాణ సంస్థకు అప్పగించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని అటకెక్కించింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇదిలా ఉంటే నిమ్జ్ పైనా కాంగ్రెస్ సర్కార్ శీతకన్ను వేసింది. కేసీఆర్ సర్కార్ చొరవతో ఇక్కడ పెట్టుబడులు పెట్టి, పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఫార్మా, హెల్త్‌కేర్, డిఫెన్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ట్రైటాన్, జర్మనీకి చెందిన లైట్ ఆటో కంపెనీలు నిమ్జ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు కేసీఆర్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. డిఫెన్స్-ఏరో స్పేస్ రంగానికి చెందిన వెమ్ టెక్నాలజీ కంపెనీ నిమ్జ్‌లో 511 ఎకరాల్లో రూ.1000 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. 2022 జూన్‌లో వెమ్‌టెక్నాలజీ కంపెనీ ఏర్పాటుకు అప్పటి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరి కారణంగా నిమ్జ్ నుంచి నాలుగు కంపెనీలు వెనక్కి వెళ్లాయి.
నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం హయాంలోనే రూ.100 కోట్ల నిధులు విడులయ్యాయి. ప్రజలు, వాహనదారుల ఇబ్బందులు తీరేలా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సహకరించాలని బీఆర్ఎస్ హయాంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌ను కోరారు. సీఎం కేసీఆర్ సూచన మేరకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.
ఈ నేపథ్యంలో కేంద్రం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.100 కోట్లు విడుదల చేసింది. 2018లో ఎంపీ బీబీ పాటిల్, దివంగత ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి కాగా ఈనెల 23న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.
జహీరాబాద్ పట్టణ సమీపంలోని హుగ్గెళ్లి వద్ద మహాత్మ బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటుకు మాజీ మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయటంతోపాటు సొంతంగా నిధులు అందజేశారు. జహీరాబాద్ ప్రాంతంలోని లింగాయత్ సమాజం హుగ్గెళ్లిలో బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటుకు పూనుకుంది.
లింగాయత్ సమాజం విజ్ఞప్తి మేరకు మంత్రిగా ఉన్న హరీష్‌రావు రూ.45 లక్షల ప్రభుత్వం నిధులను మంజూరు చేశారు. సొంతంగా మరో రూ.5 లక్షలు అందజేశారు. ఈ విగ్రహాన్నే శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనుండటం గమనార్హం.