KCR Meeting | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు తెలంగాణ సిద్ధమయ్యింది. రెండున్నరేండ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్‌పై సొంత పార్టీలోనే ముసలం పుట్టింది. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజాకంటక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్‌పై మరో పోరుకు జగిత్యాల శ్రీకారం చుట్టనున్నది. ‘కేసీఆర్ రావాలి.. రేవంత్‌రెడ్డి పోవాలి’ అనే నినాదంతో జగిత్యాల జైత్రయాత్ర మొదలుకానున్నది. ఆనాడు రైతు కూలీల న్యాయమైన డిమాం డ్ల సాధనకు.. అణచివేత.. భూస్వాముల నియంతృత్వ ధోరణిపై దండెత్తిన జగిత్యాల.. ఇప్పుడు కాంగ్రెస్ నిరంకుశపాలనపై పోరుకు సమాయత్తమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తీరు.. ఆరు గ్యారెంటీల పేరుతో వంచించడంపై నిరసన వ్యక్తం చేయనున్నది.
కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నదని సాక్షాత్తు ఆ పార్టీ నేతలే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డికి అధికారం ఇచ్చి తప్పుచేశామని, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ పాలన ప్రతిబంధకంగా మారిందంటూ ఆ పార్టీ క్యాడరే నిరసన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని, కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్తూ మూకుమ్మడిగా కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 20న జగిత్యాలలోని మోతె రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో లక్షలాది మంది సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ స్వయంగా జీవన్‌రెడ్డికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించనున్నారు. ఆయనతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వందలాది కాంగ్రెస్ నేతలు, వేలాది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరనున్నారు.
జగిత్యాల నుంచే కాంగ్రెస్ పతనం
జగిత్యాల గడ్డ నుంచే కాంగ్రెస్ పతనం ప్రారంభం కానున్నది. జీవన్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతల చేరిక ఖాయం కావడం, ఈ నెల 20న జగిత్యాలకు కేసీఆర్ వస్తుండడంతో అందరి చూపు ఇప్పుడు జగిత్యాలపై పడింది. అనేక జిల్లాల్లోనూ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లో చేరుతారని సమాచారం. కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు ఆ పార్టీని వీడేందుకు ఇక సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తుండగా మరికొన్ని చోట్ల తమ అనుచరులతో సమావేశాలు పెట్టుకుంటున్నారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో సర్వభ్రష్టత్వమయ్యిందని, పార్టీ ఇక కోలుకునే అవకాశమే లేదన్న అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నది. పదేండ్ల కేసీఆర్ జమానాతో అసలు పోలికే లేదని, ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగితే ప్రజలు తమను గ్రామాలకు కూడా రానివ్వరన్న అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతున్నది.
ఇప్పటికే ఉమ్మడి వరంగల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడేందుకు సిద్ధమయ్యారు. వీరిలో పలువురు నియోజకవర్గస్థాయి నేతలు, సిట్టింగ్ ప్రజాప్రతినిధులు కూడా ఉండటం గమనార్హం. కొందరు ప్రజాప్రతినిధులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులతో చర్చలు జరుపుతున్నారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్లో మొదలైన తిరుగుబాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తుందని, కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ అభివృద్ధిని కోరుకునే వారు కాంగ్రెస్‌ను వీడుతారని తెలుస్తున్నది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఇంటలిజెన్స్ నుంచి కూడా సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో సీఎం, పీసీసీ అధ్యక్షుడు వ్యక్తిగతంగా మాట్లాడి వారిని సమాధానపర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే, ఇది తాత్కాలికమేనని తెలుస్తున్నది. జగిత్యాల తర్వాత దక్షిణ తెలంగాణకు చెందిన ఒకరిద్దరు కీలక నేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వైపు వచ్చే అవకాశం ఉన్నది.
నియోజకవర్గాలవారీగా ఇన్చార్జుల నియామకం.. ప్రకటించిన కేటీఆర్
గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి ప్రాంగణ పర్యవేక్షణ బాధ్యతలు
జగిత్యాలలో బీఆర్ఎస్ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్న సందర్భంగా ఈ నెల 20న జగిత్యాలలోని మోతె రోడ్డులో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స భాస్థలిని ఎంపిక చేయగా, సభ విజయవంతం కోసం నియోజకవర్గాలవారీగా ఇన్చార్జులను నియమించారు. జగిత్యాల జిల్లా పరిధిలోని ఐదు నియోజకవర్గాల బాధ్యతలను సీనియర్ నాయకులకు అప్పగించారు. సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇన్చార్జులను ప్రకటించారు. జగిత్యాలకు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోరుట్లకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ధర్మపురికి ఎమ్మెల్సీ ర వీందర్‌రావు, వేములవాడకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, చొప్పదండికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని నియమించారు. జన సమీకరణ, ప్రాంగణ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతలను బీఆర్ఎస్ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి అప్పగించారు. వీరు సభ ముగిసేవరకు ఏర్పాట్లను సమన్వయం చేస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. గులాబీ శ్రేణు లు సమన్వయంతో పనిచేసి జగిత్యాల సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.