కాంగ్రెస్ ఓట్ చోరీ ఉదంతాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రతినిధులు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వేలాదిగా దొంగ ఓట్లను సృష్టించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో ఈ బోగస్ ఓట్లు ఉన్నట్టు బీఆర్ఎస్ పరిశీలనలో తేలింది.
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏ అపార్ట్‌మెంట్‌ను పరిశీలించినా పదుల సంఖ్యలో దొంగ ఓట్లున్నట్టు తెలుస్తున్నది. బోగస్ ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుల చిరునామాలతో ఉన్న అపార్ట్మెంట్లలోనే బయటపడటం గమనార్హం. అదేవిధంగా మరికొంత మంది రౌడీ షీటర్లు, కాంగ్రెస్ నేతల సన్నిహితులు, బంధువుల ఇండ్లల్లో వేలాదిగా బోగస్ ఓట్లు నమోదు చేసినట్టు స్పష్టమవుతున్నది. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీ చేస్తే వేలాదిగా దొంగ ఓట్లు బయటపడే అవకాశాలున్నాయని నేతలు చెప్తున్నారు. బోగస్ ఓట్లున్న వాళ్లంతా ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాలు, ఏపీకి చెందినవారుగా క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి ముందు కాంగ్రెస్ ఓడిపోతుందనే భయంతోనే ఓట్ చోరీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
27 ఓట్లలో 24 బోగస్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళరావునగర్ బూత్‌నంబర్ 125లో 8-3-191/369 హౌస్ నంబర్ కలిగిన ఓ మూడంతస్థుల భవనంలో 27 ఓట్లున్నాయి. ఇంటి ఓనర్, అద్దెకు ఉంటున్న మరో కుటుంబానికి చెందిన భార్యాభర్తలకు మాత్రమే ఆ చిరునామాతో ఓట్లు ఉన్నాయి. పైగా ఆ దంపతులు కొన్ని రోజుల క్రితం ఇల్లు ఖాళీ చేసి వెళ్లారు. తాజా ఓటర్ల జాబితాను చూపించి ఓనర్‌ను ఆరా తీయగా జాబితాలో 24 మంది ఎవరో తనకు తెలియదని సమాధానమిచ్చారు. వారిని గతంలోనూ ఎక్కడా చూడలేదని, వారికి గతంలో ఇల్లు అద్దెకు కూడా ఇవ్వలేదని స్పష్టంచేశారు. పైగా 24 మంది ఓటర్లలో ముగ్గురు ముస్లింలు కూడా ఉన్నారు. అపార్ట్మెంట్ నిర్మించి 15 ఏండ్లు అవుతున్నదని, ఇప్పటివరకు ఒక్క ముస్లిం కుటుంబం కూడా తమ ఇంట్లో అద్దెకులేదని తేల్చి చెప్పారు. అంటే.. కుటుంబ యజమాని, ఇటీవల ఖాళీ చేసిన దంపతులు మినహా మిగతా 24 ఓట్లు బోగసే అనే విషయం బీఆర్ఎస్ పరిశీలనలో స్పష్టమైంది.
971 మందికి రెండు ఓట్లు
భారత ఎన్నికల నియమావళి ప్రకారం ఒక వ్యక్తికి దేశంలో ఎక్కడైనా సరే ఒకే ఓటు ఉండాలి. కానీ బీఆర్ఎస్ పరిశీలన ప్రకారం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండేసి ఓట్లున్నవారు ఏకంగా 971 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన తుది జాబితాలో వీరు ఓటర్లుగా ఉన్నారు. నియోజకవర్గంలోని రెండు వేర్వేరు బూత్‌లలో ఓట్లను కలిగి ఉన్నారు. పేరు, చిరునామా, ఇతర వివరాలన్నీ రెండు చోట్లా ఒకే విధంగా ఉన్నాయి. బూత్ నంబర్ మాత్రమే వేరుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీలో భాగంగానే ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు బూత్‌లలో ఓట్లను సృష్టించినట్టు బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. మరికొన్ని చోట్ల ఒకే వ్యక్తికి మూడు ఓట్లు ఉన్నట్టు బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఇలా ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లున్నా.. వాటిని తొలగించక బూత్ లెవెల్ ఆఫీసర్ల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కొందరికి డబుల్ ఓట్లున్నా బీఎల్వోలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించి వాటిని తొలగించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
287 ఇండ్లలో 30కి పైగా ఓట్లు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా 30కి పైగా ఓట్లున్న ఇండ్లు 287 ఉన్నట్టు బీఆర్ఎస్ ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ఇందులో చాలావరకు 50 ఓట్లకు పైగానే ఉన్నవి ఎక్కువ మొత్తంలో ఉన్నట్టు స్పష్టమైంది. ఒకే ఇంట్లో 30కి పైగా ఓట్లుండటంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే చిరునామాలో 30కి మించి ఓట్లుండాలంటే అది కనీసం 4 ఫ్లోర్లకుపైగానే ఉండి, అందులో నివసించే వారంతా స్థానికతతోపాటు ఇక్కడ ఓటును కలిగి ఉండాలి. చాలావరకు అపార్ట్మెంట్లలో ఉన్నవారు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో, ఏపీలో ఓట్లను కలిగి ఉన్నట్టు తెలుస్తున్నది. అలాంటప్పుడు 287 చిరునామాల్లో 30 పైగా ఓట్లుండటం ఎలా సాధ్యమవుతునే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. 30కి పైగా ఓట్లున్న చిరునామాల్లో ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితులు, రౌడీ షీటర్లే ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
జూబ్లీహిల్స్‌లో ఓట్చోరీ తీరిది!