కొడంగల్, ఫిబ్రవరి 12 : సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి గడ్డుపరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నారు. బుధవారం కూడా రేవంత్రెడ్డి నియోజకవర్గంలోని కొడంగల్ మండలం చిన్ననందిగామ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు 30 మంది బొంరాస్పేట మండల కేంద్రంలో బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ అభివృద్ధి పూర్తిగా వెనుకబడి పోయిందని విమర్శించారు. రైతులు, ప్రజలు ఎటువంటి సంక్షేమ ఫలాలు అందుకోలేక నానా ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే తెలంగాణను కాపాడుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎంతోకష్టపడి పనిచేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తే తమకు పార్టీలో ఎటువంటి గుర్తింపు లేదని ఆరోపించారు.