మల్కాజిగిరి, ఏప్రిల్ 23: మల్కాజిగిరిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయించనందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి చెట్టు కింద కూర్చొని వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మల్కాజిగిరి మున్సిపల్ సర్కిల్ వద్ద ఉన్న చెట్టు కింద కూర్చుని ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు కనీసం తనకు కనీసం పీఏను కూడా కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్లలోపు కరెంటు బిల్లులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం పథకం, రేషన్‌కార్డులు, అర్హులైన పేదలకు పెన్షన్లు అందకపోవడం తదితర అంశాలపై పలువురు తనకు ఫిర్యాదు చేశారని తెలిపారు. హామీలు నెరవేర్చని కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు.
సదరం సర్టిఫికెట్ల విషయంలో దివ్యాంగులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు లేకపోవడంతో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా పనులు కావడం లేదని పేర్కొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే కలెక్టర్ కార్యాలయం వద్ద కూడా కూర్చుంటానని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సునీతాయాదవ్, మాజీ కార్పొరేటర్లు జగదీశ్‌గౌడ్, మురుగేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బద్దం పరశురాంరెడ్డి, జేఏసీ వెంకన్న, జీకే హనుమంతరావు, అమినుద్దీన్, రాముయాదవ్, చిన్నయాదవ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.