అచ్చంపేట, నవంబర్ 2 : నల్లమల బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇదే నల్లమల గిరిజనులు సర్వం కోల్పోయి ప్రాణాలు పోతుంటే పట్టించుకోకుండా ఉపఎన్నికలే ముఖ్యమైనట్టు వ్యవహరించడం సరికాదని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట బీఆర్ఎస్ సమన్వయకర్త మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మొంథా తుపాన్ కారణంగా నక్కలగండి రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మార్లపాడుతండాలో 350 ఇండ్లు నీటిలో మునిగిపోయాయి. సర్వం కోల్పోయి తాగడానికి నీళ్లు, తినేందుకు బియ్యం, పాత్రలు, సరుకులు లేని దుర్భర పరిస్థితిలో ఉన్న తండాను ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు.
బురదలోనే పర్యటిస్తూ ఒక్కో ఇంటికి వెళ్లి వారి బాధను కళ్లారా చూశారు. తినేందుకు తిండి, తాగేందుకు నీళ్లు లేవని, పంటలు, వస్తువులు, బంగారం, డబ్బులు, పశువులు, మేకలు సర్వంపోయిందని, ఎలా బతకాలని గిరిజనులు మర్రిని పట్టుకొని రోదించారు. స్పందించిన మర్రి ఎంజేఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు 25కిలోల సన్న బియ్యం, 9 రకాల నిత్యావసర సరుకుల చొప్పున పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ అలావచ్చి వెళ్లిపోయిండని గ్రామస్థులు మండిపడ్డారు. అనంతరం మర్రి మాట్లాడుతూ మార్లపాడుతండాకు నక్కలగండి రిజర్వాయర్‌లో ముగినిపోతుందని.. ఇక వీళ్లతో తమకేం పనుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ భావిస్తున్నట్టు చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఎన్నికలపై ఉన్న ప్రాధాన్యత మార్లపాడుతండాపై లేదని మండిపడ్డారు. సీఎం వెంటనే మార్లపాడుతండాను సందర్శించి, పంటనష్టాన్ని అంచనా వేసి వెంటనే పరిహారం మంజూరు చేయాలని కోరారు. తిరుగు ప్రయాణంలో మన్నెవారిపల్లి వద్ద వాగును పరిశీలించి వాగులో మోటర్లు, వరిపొలాలు మునిగిపోయిన రైతులను ఓదార్చారు. అచ్చంపేట మండలం దుబ్బతండాకు చెందిన ముడావత్ బీక్యా రెండు ఎడ్లు వాగులో కోట్టుకు పోగా ఆయనను పరామర్శించారు.