హైదరాబాద్: తన ఇంట్లో ఎలాంటి డబ్బు దొరకలేదని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Marri Janardhan Reddy) అన్నారు. ఇన్ని గంటలు తమను ఎందుకు ఇబ్బంది పెట్టారని ప్రశ్నించారు. ఓరల్ కంప్లయింట్ చేస్తేనే ఇలా దాడులు చేస్తారా అని పోలీసులను నిలదీశారు. తనిఖీల పేరుతో తమను ప్రచారానికి వెళ్లకుండా గలాటా సృష్టిస్తున్నారని విమర్శించారు. పోలీసులతో కలిసి కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. కూకట్పల్లి మోతీనగర్‌లోని ఆయన నివాసంలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలా చేయొద్దని కోరారు. పోలీసులకు డబ్బులు కాదు, తన లో దుస్తులు దొరికాయని చూపించారు.
అన అనుమతి లేకుండా ఎవరూ లేని సమయంలో పోలీసులు ప్రవేశించారని చెప్పారు. తనను ఇంట్లోకి వెళ్లనీయకుండా అడ్డుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తెలంగాణలో పోలీసుల రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు. వాచ్‌మెన్‌ను బెదిరించి తాళం తీయించి దౌర్జన్యంగా లోపలికి వెళ్లారన్నారు. జూబ్లీహిల్స్ పరిధిలో తన ఇల్లు లేకున్నా పోలీసులు ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు పోలీసులతో పైసలు పంచిస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలో సీఎం, మంత్రులు పర్యటించడం వారిలో ఓటమి భయానికి నిదర్శమన్నారు. పోలీసుల యూనిఫాంను గౌరవించి మాట్లాడుతున్నానని చెప్పారు. మీడియాను అనుమతించకుండా పోలీసులు వీడియో తీయడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసుంటేనే నమ్మకం పోయిందని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ ఇలాంటిది జరుగలేదన్నారు.
అంతకుముందు పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. పోలీసులు తన ఇంట్లో డబ్బులు పెట్టించారన్నారు. పోలీసులు బ్యాగులను తన ఇంట్లోకి తీసుకెళ్లారని చెప్పారు. డైవర్షన్ కోసమే మా ఇండ్లలో సోదాలు చేస్తున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ రౌడీయిజం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రౌడీయిజమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రౌడీయిజం చేస్తారని అనుకోలేదని మండిపడ్డారు.