నాగర్‌కర్నూల్, ఆగస్టు 5 : చివరి శ్వాస ఉన్నంత వరకు బీఆర్ఎస్ను వీడేదేలేదని, అందరినీ కలుపుకొనిపోయి నాగర్‌కర్నూల్ జిల్లాలో గులాబీ పార్టీని మరింత బలమైన శక్తిగా మారుస్తామని నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన వాస్తవాలు, అపోహలను పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలియజెప్పేందుకు మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను వారు వీక్షించారు.
అనంతరం మర్రి మాట్లాడుతూ తాము పార్టీ మారుతున్నట్టు వస్తున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. కేసీఆర్, కేటీఆర్ ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతామని చెప్పారు. కొందరు కాంగ్రెస్ నేతలు పనిగట్టుకొని పార్టీ మారుతున్నట్టు సామాజిక మాద్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జైపాల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ను వీడి.. బీజేపీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని తెలిపారు. బీఆర్ఎస్లోనే ఉంటూ కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న కార్యక్రమాలు, తెలంగాణ అభివృద్ధికోసం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు.
గువ్వల బాలరాజుకు ప్రభుత్వ విప్‌గా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ అవకాశం కల్పించినా పార్టీని ఎందుకు వీడుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు. బీరం మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఎవరెన్ని చెప్పినా బీఆర్ఎస్ను వీడేది లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ వెంటే ఉండి నాగర్‌కర్నూల్ జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేస్తామని స్పష్టంచేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు పనిగట్టుకొని తాము పార్టీ మారుతున్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.