చండూరు, జూన్ 22: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకం పేదోడికి కలగానే మిగులుతుంది. పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలని ఓ మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పలువురు లబ్ధిదారులను గుర్తించి మంజూరు పత్రాలను అందజేశారు. ఇందులో పలువురు ముగ్గు కూడా పోశారు. కానీ ఇక్కడే సమస్య మొదలైంది ఇల్లు కట్టేందుకు వస్తున్న మేస్త్రీలు సిండికేట్గా మారడంతో ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టేందుకు రూ.3 లక్షల నుంచి రూ.3.80 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం. వాస్తవానికి రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు మేస్త్రీల కూలి అవుతుందని పలువురు చెబుతున్నారు.
కానీ మేస్త్రిలంతా సిండికేట్ అవుతూ ఎక్కువ మొత్తంలో అడుగుతున్నట్లుగా పలువు లబ్ధిదారులు చెబుతున్నారు. ఇదే అదునుగా సీకు, సిమెంట్ వ్యాపారులు కూడా సిండికేట్ అయ్యే దిశగా చర్చలు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఇలా అయితే ప్రభుత్వం ఇచ్చేది మేస్త్రీలకే సరిపోతుందని పేదవాడు అదనపు మొత్తాన్ని భరించే పరిస్థితి ఉండదు. దీంతో ఇప్పటికే పలువురు ముగ్గు పోసినప్పటికీ పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. ఇలా అయితే డబ్బులు ఉన్నవారు తప్ప పేదలు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించే పరిస్థితి ఉండదు. దీంతోపాటు ఒక్కో మేస్త్రి 5 నుంచి 10 ఇళ్లు ఒప్పుకుంటున్నారు. ఇలా అయితే ఏకకాలంలో ఇల్లు పూర్తి చేయడం కూడా కష్టమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపించి ఈ సమస్యకు పరిష్కారం చూపించాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.