బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 21:06:27

గిరిజనులకు అన్యాయం చేస్తున్న మావోయిస్టులు

గిరిజనులకు అన్యాయం చేస్తున్న మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు మావోయిస్టులు అన్యాయం చేస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్ సునీల్‌దత్‌ చెప్పారు. చర్ల మండలం బత్తినపల్లి, తిప్పాపురం గ్రామాల ప్రజలు కూలీ పనుల కోసం, నిత్యావసర వస్తువుల కొరకు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. వారి సౌకర్యం కోసం రోడ్ల నిర్మాణం చేపడుండగా మావోయిస్టులకు కంటగింపుగా తయారైందన్నారు. 

అభివృద్ది పనులను అడ్డుకుంటున్న మావోయిస్టులు మంగళవారం రాత్రి రెండు రోడ్డు నిర్మాణ యంత్రాలను తగులబెట్టారని చెప్పారు. పక్కనే పూరిగుడిసెల్లో నివాసముంటున్న గిరిజనులు భయాందోళనలకు గురై బయటకు పరుగులు తీశారని, మావోయిస్టులు ఏజెన్సీ ప్రాంత గిరిజనులను భయాందోళనలకు గురిచేస్తూ, అభివృద్ధికి అడ్డుపడుతూ.. రోడ్డు నిర్మాణ యంత్రాలను తగలబెడుతున్నారని తెలిపారు. మావోయిస్టు అగ్ర నాయకులేమో చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో తల దాచుకుంటూ.. ఇక్కడి అమాయక గిరిజనుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారనడంలో ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుందన్నారు. ఇటీవల విడుదల చేసిన మావోయిస్టు కరపత్రాల్లో ఒకవైపు అభివృద్ధిని అడ్డుకోవడం లేదంటూ చెప్తూనే.. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడట వారి అరాచకత్వానికి నిదర్శనమని చెప్పారు. గిరిజన ప్రాంతాలలో జరిగే మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఇకనైనా మావోయిస్టులు ఆపాలని ఎస్పీ సునీల్‌దత్‌ సూచించారు.


logo