హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తూ 20న తెలుగు రాష్ర్టాల బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖను విడుదల చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, సుధాకర్, గౌతం, మైలారపు అడెలు అలియాస్ భాసర్తోపాటు మరికొందరిని బూటకపు ఎన్కౌంటర్ చేసిన కేంద్ర ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఖండించాలని కోరారు. అటవీ, ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే ఉద్దేశంతో 550మందికిపైగా మావోయిస్టులను బూటకపు హత్యలు చేశారని మండిపడ్డారు.
మే 21న మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల బసవరాజ్‌తోపాటు 27మందిని పొట్టనపెట్టుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈనెల 3నుంచి నేషనల్ పార్లో మరో దాడిని నిర్వహించి ఏడుగురిని హత్య చేసినట్టు జగన్ తెలిపారు. మావోయిస్టు ప్రతినిధులు చర్చలకు ముందుకొచ్చినా.. కేంద్రం పట్టించుకోకుండా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా పనిచేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం ప్రభుత్వ చర్యలతో అటవీ ప్రాంతంలోని గిరిజనులు భయాందోళనలతో కాలం వెళ్లదీస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ల నాటకాన్ని ఎండగడుతూ.. కగార్ దాడులను వ్యతిరేకిస్తూ ఈనెల 20న ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల్లో బంద్‌ను పాటించాలని లేఖలో కోరారు.