ములుగు: ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆ ప్రాంతంలో వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరుతో ఓ లేఖ వదిలివెళ్లారు. మృతులను పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోలేందంటూ అందులో పేర్కొన్నారు. మృతులను ఉయిక రమేశ్, ఉయిక అర్జున్‌గా పోలీసులు గుర్తించారు. రమేశ్ పంచాయతి కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
వీరిద్దరి హత్యతో ఏజెన్సీలో మళ్లీ అలజడి నెలకొంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏజెన్సీలో ఇన్ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల దుశ్చర్యతో తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరై ఉంటారని ఆరాతీస్తున్నారు. మావోయిస్టులు నేరుగా పాల్గొన్నారా లేదా సానుభూతిపరులా అనే కోణం దర్యాప్తు చేస్తున్నారు.