హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): నిత్యం కరెంటు కోతలు, రాష్ట్రమంతా తాగు, సాగునీటి వెతలు. ఒకవైపు ధాన్యాన్ని కొనేవారు కరువు.. ఇంకోవైపు నాటేందుకు విత్తనాలు కావాలంటే రైతులపై పోలీసు లాఠీల దరువు. తెలంగాణ తాజా ముఖచిత్రమిది. ఐదు నెలల్లోనే ఘనత వహించిన రేవంత్ సర్కారు పాలనా తీరిది. రాష్ట్రంలోని ఏ మూలన ఉన్న సామాన్య పౌరుడిని అడిగినా చెప్పే సత్యాలివి. మరి, వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి? లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనికట్టు కట్టాలి. అనుకూల మీడియాలో రోజుకో లీకుతో సరికొత్త కథనం వండి వార్చాలి. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది కూడా ఇదే. ఫోన్ ట్యాపింగ్ పేరుతో డైలీ సీరియల్‌ను ప్రభుత్వం ప్రజల మీదకు విసురుతున్నది.
ఫోన్ ట్యాపింగ్‌తో ముడిపెట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2018, 2022లో జరిగిన ఉప ఎన్నికలు, 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల సమయాల్లో 17 చోట్ల హవాలా సొమ్మును పోలీసులు సీజ్ చేశారు. ఇది ఫోన్ ట్యాపింగ్ ద్వారానే సాధ్యమైందని నిందితులు అంగీకరించినట్టుగా చెప్తున్నారు. కానీ అదేదో కేసీఆర్ ప్రభుత్వమే పనిగట్టుకొని చేసినట్టుగా ప్రచారం చేయడమే దుర్మార్గమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికార యంత్రాంగం పూర్తిగా ఎన్నికల కమిషన్ ఆధీనంలోకి వెళ్తుంది. కాబట్టి ఈసీ ఆధీనంలోని పోలీసు యంత్రాంగం ఫోన్ ట్యాపింగ్ ద్వారా హవాలా సొమ్మును పట్టుకోవడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా రహస్యంగా సమాచారాన్ని సేకరించేందుకు పలు మార్గాలను ఎంచుకుంటారు. ఇందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాన్ని సేకరించి రూ. 24 కోట్ల హవాలా సొమ్మును పట్టుకుని ఉండవచ్చని చెప్తున్నారు. ఎన్నికల సమయంలో ఇంత పెద్ద ఎత్తున డబ్బును ఎరవేసి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించకుండా హవాలా సొమ్మును పట్టుకోవడమనేది ప్రజాస్వామ్యానికి మంచి చేయడమే అవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక్కడ కేవలం ప్రతిపక్ష పార్టీల డబ్బులను మాత్రమే పట్టుకున్నారని, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ డబ్బులను పట్టుకోలేదనే వింత వాదన తెరపైకి తెస్తున్నారు. అంటే ప్రతిపక్ష పార్టీలు ఆయా ఎన్నికల సందర్భాల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇంత పెద్ద మొత్తాన్ని తరలించాయనేది వాస్తవమని బట్టబయలైంది.
‘అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ డబ్బులు తరలించిందనేందుకు రుజువులు లేవు. తరలించి ఉండకపోవచ్చు’ అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పి పుచ్చుకొని, వాటిపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలించే హవాలా సొమ్మును పట్టుకోవడాన్ని కూడా తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తుండటమే సరికొత్త వింతగా ఉందని రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
ఎన్నికల వేళ అక్రమ నగదు రవాణాను కట్టడి చేయడంలో భాగంగా టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ, స్థానిక పోలీసుల సహకారంతో 2023, అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ సొమ్ము వివరాలను అరెస్ట్ అయిన నిందితులు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.