హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కార్యాలయ వేదికగా కాంగ్రెస్ పెద్దలు దేశంలోనే అతిపెద్ద తప్పుడు సమాచారాన్ని వ్యాప్తిచేసే మాఫియాను నడుపుతున్నారని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్లు పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి, దినేశ్‌చౌదరి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావుతో కలిసి ఆయన బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి సొంత పార్టీ నేత అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సోషల్ మీడియాలో తిట్టించేందుకు ఓ టీంను ఏర్పాటు చేశారని తెలిపారు. అదే తరహాలో సీఎం కార్యాలయం నుంచి బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు సీఎంవో నుంచే 138 మంది సభ్యులతో ‘తెలంగాణ రైజింగ్ టాక్ కమ్యూనికేషన్’ పేరిట వాట్సాప్ గ్రూప్ నడిపిస్తున్నారని వెల్లడించారు.
ఆ గ్రూప్‌లో ఉన్న ఓ తెలంగాణ ఉద్యమకారుడు విజిల్ బ్లోయర్‌గా వ్యవహరించి తమకు స్క్రీన్ షాట్లు పంపితే సంచలన విషయాలు తెలిశాయని క్రిశాంక్ చెప్పారు. వాట్సాప్ గ్రూప్‌నకు అడ్మిన్లుగా సీఎం పీఆర్వో అన్వేశ్, మీడియా కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శ్రీరామ్ కర్రీ, కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్చార్జి సతీశ్ మన్నే, బాసిత్, రాజ్ ఆకుల తదితరులు ఆ గ్రూప్‌లో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఫా ర్ములా ఈ కార్ రేసు, కాళేశ్వరంపై విచారణ పేరి ట తప్పుడు ప్రచారాన్ని వీరు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం లో అధికారికంగా ఏ సిట్ అధికారి కూడా లో పల జరిగిన విచారణ గురించి బయట మాట్లాడనప్పుడు ఈ ఫేక్ ప్రచారం ఎక్కడి నుంచి వస్తున్నదని తెలుసుకుంటే ఈ బాగోతం బయటపడిందని చెప్పారు. విచారణ సందర్భంగా సినిమా వాళ్లతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడినట్టుగా థంబ్ నెయిల్స్ పెట్టి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ వాట్సాప్ గ్రూప్ నుంచి ఫేక్ న్యూస్ రాకెట్‌ను నడుపుతున్నారని క్రిశాంక్ మండిపడ్డారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న పీఆర్వోలు, అధికారిక హోదాలో ప్రతిపక్ష నేతలపై చిల్లరమల్లర సమాచారాన్ని వ్యాప్తి చేయొచ్చా? అని ప్రశ్నించారు. సిట్ చీఫ్‌గా ఉన్న సజ్జనార్ ఈ విషయంలో ఏం చేస్తున్నారని అడిగారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెంటనే స్పందించి శ్రీరాం కర్రీ, అన్వేష్‌పై కేసులు నమోదు చేసి, విచారణ జరిపి.. ఉద్యోగంలోంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఫేక్ సమాచారాన్ని బాట్ అకౌంట్స్ (ఆటోమెటెడ్ సాఫ్ట్వేర్ల ద్వారా రూపొందించిన ఖాతాలు) ద్వారా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారని వివరించారు. వీరు పోస్టు చేసిన కంటెంట్‌పై వందల సంఖ్యలో కామెంట్లు తిడుతున్నట్టు ఉంటాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఫేక్ అకౌంట్ల వివరాలు, వాటికి వస్తున్న కామెంట్లను ప్రింట్ చేసి తీసుకొచ్చి మీడియా ఎదుట ప్రదర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ అంటే భయమని అందుకే ఆయన ఇమేజ్ను దెబ్బతీయడానికి వ్యక్తిత్వ హననం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు.

ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్న పీఆర్వోలు, అధికారిక హోదాలో ప్రతిపక్ష నేతలపై చిల్లరమల్లర సమాచారాన్ని వ్యాప్తి చేయొచ్చా? అని క్రిషాంక్ ప్రశ్నించారు. సిట్ చీఫ్‌గా ఉన్న సజ్జనార్ ఈ విషయంలో ఏం చేస్తున్నారని అడిగారు. డీజీపీ శివధర్‌రెడ్డి వెంటనే స్పందించి శ్రీరాం కర్రీ, అన్వేష్‌పై కేసులు నమోదు చేసి, విచారణ జరిపి.. ఉద్యోగంలోంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
గతేడాది ఆగస్టు 29న ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఈ ఫేక్ ప్రచారం నడుస్తున్నని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పుట్ట విష్ణువర్ధన్‌రెడ్డి మం డిపడ్డారు. వందల మంది ప్రభుత్వ అధికారులను బీఆర్ఎస్పై దుష్ప్రచారానికి వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదో వ్యవస్థీకృతమైన నేరంలా మారిందని, పద్ధతి మార్చుకోని అధికారులపై చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముం దుండి ఫేక్ న్యూస్‌ను బరితెగించి ప్రచారం చేస్తున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు ఆరోపించారు. ‘సీఎంవో నుంచే ఈ ఫేక్ న్యూస్ ముఠా నడుస్తున్నదని సాక్ష్యాధారాలతో బయటపెట్టాం. డీజీపీకి ఫిర్యాదు చేసినా.. ఎలాం టి చర్యల్లేవ్. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ మహిళా నేతలపై సైతం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు’ అని అన్నారు.

ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ప్రదర్శించిన ఫొటోల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోను వాడుకుని అడ్డగోలుగా థంబ్‌నెయిల్స్ సృష్టించినట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ‘నేను మాట్లాడుతున్నది కేటీఆర్ వింటున్నాడు..’ అంటూ థంబ్ నెయిల్ పెట్టి ఓ నలుగురు హీరోయిన్ల ఫొటోలు దానికి జత చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై డిజిటల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా అడ్డగోలుగా రాయించిన వార్తలను సదరు గ్రూపులో సర్క్యులేట్ చేయడం కనిపించింది. వందలకొద్ది పేరడీ అకౌంట్లను క్రియేట్ చేసి వాటి ద్వారా బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నట్టు స్పష్టమైంది. ఆయా హ్యాండిళ్లలో అడ్డగోలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను కించపర్చేలా ఫొటోలను మార్ఫింగ్ చేసి లోగోలుగా వాడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎంవో కార్యాలయం వేదికగా మారడం విస్మయానికి గురిచేస్తున్నది.
కాంగ్రెస్ పేరడి అకౌంట్ల పేరిట సభ్యత, సంస్కారం, విచక్షణ, విజ్ఞత లేకుండా అడ్డగోలుగా ప్రతిపక్ష నాయకుల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేశ్‌చౌదరి విమర్శించారు. కేవలం బీఆర్ఎస్ పార్టీని దెబ్బ తీయడానికే ఈ అకౌంట్లను కాంగ్రెస్ వాడుకుంటున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ బాట్స్ ఆర్మీ రాష్ట్రంలో కాలకేయ సైన్యంలా తయారైందని మండిపడ్డారు. ఈ వికృత క్రీడను డీజీపీ వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు.

‘తెలంగాణ స్ర్కైబ్’ పేరిట ఫేక్ వార్త క్లిప్పింగ్‌లను సైతం కాంగ్రెస్ ఐటీ సెల్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నది. బీఆర్ఎస్ నాయకురాలు మాగంటి సునీతను వ్యక్తిత్వ హననం చేసేలా అడ్డగోలుగా రాసి ఉన్న ఫేక్ వార్త క్లిప్పింగ్‌ను తెలంగాణ స్ర్కైబ్ పేరిట కాంగ్రెస్ ఐటీ సెల్ వదిలింది. దీంతోపాటు కేటీఆర్‌కు హరీశ్‌రావు మర్యాద ఇవ్వలేదంటూ వండి వార్చిన మరో ఫేక్ వార్తను ప్రచారం చేసింది. సిట్ అధికారులు ‘హీరోయిన్ల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయించారు’ అని కేటీఆర్‌ను అడిగినట్టు ఉన్న మరో ఫేక్ వార్తను కూడా సోషల్ మీడియాలో కాంగ్రెస్ వైరల్ చేసింది. ‘ఒకరిద్దరు కాదు చాలామంది హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశాం’ అని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు చెప్పినట్టు ఉన్న క్లిప్పింగ్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. ఇవన్నీ ఫేక్ అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారాన్ని మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతలు దీటుగా తిప్పికొట్టారు.