హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అత్యంత ఆప్తమిత్రుడు, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి పెద్ద ఎత్తున అసైన్డ్ భూముల ఆక్రమణకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచనల విమర్శలు చేశారు. అర్హులైన పేదలకు దక్కాల్సిన సుమారు 15 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడు వేం కృష్ణభార్గవ్రెడ్డి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని మండిపడ్డారు. ఆ భూముల్లో శ్రీ సాయికృష్ణ గ్రానైట్స్ పేరుతో బ్లాక్ గ్రానైట్ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సంస్థ వేం నరేందర్‌రెడ్డి భార్య వేం విజయలక్ష్మి పేరుతో ఉన్నదని వివరించారు. భూ భారతి పోర్టల్ ద్వారా అన్ని ఆధారాలను మంగళవారం తెలంగాణభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో క్రిశాంక్ బయటపెట్టారు. భూ భారతి వ్యవస్థను సొంతానికి వాడుకొని అసైన్డ్ భూములను ఆక్రమించుకున్న వేం నరేందర్‌రెడ్డి కుటుంబంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ లోకాయుక్తను ఆశ్రయించడమే కాకుండా, కోర్టుల్లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయనున్నదని, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు కూడా చేస్తుందని హెచ్చరించారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారులకు చెందిన అసైన్డ్ భూములను భూ భారతి పోర్టల్ ద్వారా అక్రమంగా వేం నరేందర్‌రెడ్డి తన కుమారుడు వేం కృష్ణభార్గవ్రెడ్డి పేరిట మార్చారని క్రిశాంక్ వెల్లడించారు. సుమారు 15 ఎకరాల అసైన్డ్ భూములు ఈ కుటుంబానికి అనుసంధానమై ఉన్నాయని, ఆ భూముల్లో శ్రీ సాయి కృష్ణ గ్రానైట్స్ పేరుతో బ్లాక్ గ్రానైట్ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సంస్థ వేం నరేందర్‌రెడ్డి భార్య వేం విజయలక్ష్మి పేరుతో కొనసాగుతున్నదని తెలిపారు. భూ పాస్‌బుక్స్, సర్వే వివరాలు, మైనింగ్‌శాఖ రికార్డులు, ఎన్నికల అఫిడవిట్ల ప్రతులను చూపిస్తూ, ప్రభుత్వ రికార్డుల్లో అసైన్డ్, ప్రొహిబిటెడ్గా ఉన్న భూములను ఎలా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి యాజమాన్య మార్పులు చేశారని ప్రశ్నించారు. అర్పణపల్లిలో సర్వేనంబర్ 15/10లో అర ఎకరం, 15/11లో ఎకరం, 15/13లో రెండు ఎకరాలు వేం కృష్ణభార్గవ్రెడ్డి పేరిట రికార్డు అయినట్టు ఆధారాలు చూపించారు. సర్వేనంబర్ 7/11లో రెండున్నర ఎకరాలు, 7/12, 7/13లో ఎకరం చొప్పున రెండు ఎకరాలు, 7/1/2 మరో ఎకరంన్నర భూమి కృష్ణభార్గవ్రెడ్డి పేరిట రిజిస్ట్రర్ అయిందని వివరించారు. 1977 యాక్ట్ ప్రకారం.. ఈ భూములు అసైన్డ్ లాండ్స్ అని 11వ కాలంలో స్పష్టంగా పేర్కొన్నట్టు తెలిపారు.
2010లో ఎమ్మెల్యేగా, 2015లో ఎమ్మెల్సీగా పోటీచేసిన సమయంలో వేం నరేందర్‌రెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లలో ఈ భూముల వివరాలు కనిపించలేదని క్రిశాంక్ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2026లో ఎంపీగా పోటీచేసిన అఫిడవిట్లలో ఈ వివరాలు బయటకొచ్చాయని వివరించారు. ఈ భూములు శ్రీసాయి కృష్ణ గ్రానైట్స్ కంపెనీ కింద ఉన్నట్టు స్వయంగా ఆయనే తెలిపారని గుర్తుచేశారు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న అసైన్డ్ భూముల సర్వే నంబర్లు, ఈ గ్రానైట్ కంపెనీ ఉన్న ఈ భూముల సర్వే నంబర్లు ఒక్కటేనని స్పష్టంచేశారు. అవి అసైన్డ్ భూములేనని ధ్రువీకరిస్తూ స్థానిక ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, అప్పటి మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ సంతకాలు చేసిన పత్రాలను మీడియాకు చూపించారు. ఈ భారీ భూ కుంభకోణంలో అద్వైత్‌కుమార్‌సింగ్ పాత్ర కూడా ఉన్నదని ఆరోపించారు. ఇన్ని ఆధారాలున్నా యాజమాన్య మార్పులకు, రిజిస్ట్రేషన్‌కు, అసైన్డ్ భూముల్లో మైనింగ్‌కు కలెక్టర్ ఎలా అనుమతులిచ్చారని ప్రశ్నించారు. ఈ అనుమతులు కల్పించిన అధికారులకు తర్వాత కీలక పోస్టింగులు ఇవ్వడం క్విడ్ ప్రోకో అనుమానాలకు తావిస్తున్నదని చెప్పారు. ఫిబ్రవరిలో అద్వైత్‌కుమార్ సింగ్‌ను మహబూబాబాద్ నుంచి బదిలీ చేస్తే స్థానికులు సంబురాలు చేసుకున్నారని గుర్తుచేశారు. అదే సమయంలో వేం నరేందర్‌రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టగానే, అద్వైత్ కుమార్‌సింగ్‌ను ఢిల్లీలోని తెలంగాణభవన్‌కు స్పెషల్ సెక్రటరీగా నియమించడంపై అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.
వేం నరేందర్‌రెడ్డి కుమారుడి పేరిట రిజిస్ట్రర్ అయిన అసైన్డ్ భూములను వెంటనే రద్దు చేసి లబ్ధిదారులకు తిరిగి అప్పగించాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు. భూ బదిలీలు, మైనింగ్ కార్యకలాపాలపై న్యాయపరమైన సీబీఐ విచారణ జరుపాలని కోరారు. యాజమాన్య మార్పులు, మైనింగ్ అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, భూ భారతి వ్యవస్థ దుర్వినియోగంపై వేం నరేందర్‌రెడ్డి, అప్పటి కలెక్టర్‌పై విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ లోకాయుక్తను ఆశ్రయించడమే కాకుండా, కోర్టుల్లో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేస్తుందని హెచ్చరించారు.