హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ (Manne Krishank)ఫైర్ అయ్యాడు. తొక్కుడు బిళ్ల ఆడే ఈ ముఖ్యమంత్రికి ఫార్ములా-ఈ రేస్(Formula-E Race) గురించి ఏం తెలుసని ఘాటుగా విమర్శించారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించారని ఆరోపించారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు న్యాయవాది పక్కన ఉండొచ్చన్నారు. న్యాయవాదిని తీసుకుపోతాను అని కేటీఆర్ అంటే ఏసీబీ వాళ్లు ఎందుకు అంత డ్రామా చేశారని సూటిగా ప్రశ్నించారు.
న్యాయవాది లేకపోతే ఏసీబీ వాళ్లు పట్నం నరేందర్ రెడ్డి కేసు లాగే వాళ్లకు నచ్చిన స్టేట్మెంట్ రాసుకుంటారని క్రిశాంక్ అన్నారు. అంతే కాకుండా కేటీఆర్ విచారణకు సహకరించలేదని కోర్టుకు చెప్పే అవకాశం ఉందన్నారు. అసలు ఈ కేసులో క్రిమినల్ మోటివ్ ఏంటి? ఫార్ములా-ఈ వాళ్లను ఇక్కడికి తీసుకురావడం నేరమా? కశ్మీర్‌కు మోటార్ స్పోర్ట్స్ తీసుకువచ్చామని ప్రధాని మోదీ, అమిత్ షా చాలా గొప్పగా చెప్పుకున్నారు. వాళ్లకు గొప్ప అయింది మనకు గొప్ప కాదా? అని నిలదీశారు. హైదరాబాద్ నగరానికి మొదటి సారి ఫార్ములా- ఈ రేస్ రావటం గొప్ప కాకుండా పోతుందా అని ప్రశ్నించారు.
తొక్కుడు బిళ్ల ఆడే ఈ ముఖ్యమంత్రికి.. ఫార్ములా-ఈ రేస్ గురించి ఏం తెలుసు.. నువ్వు ఒక్క కంపెనీ కూడా తేలేదు కాబట్టి ఇవాళ నీ పేరు కూడా ఎవరు గుర్తుపెట్టుకోవడం లేదన్నారు. అప్పులు అని అంటున్నారు. అప్పుల గురించి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది తీసుకోవాలా ? రేవంత్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది తీసుకోవాలా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చాలా మంచి నటుడు, చాలా బాగా అబద్ధాలు చెప్తాడని విమర్శించారు.