నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్‌పై నమోదుచేసిన సోషల్ మీడియా కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈ కేసు విచారణను కొనసాగించరాదని హైకోర్టు కిందిస్థాయి కోర్టును ఆదేశించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన్నె క్రిషాంక్ సామాజిక మాధ్యమాలలో పోస్టులు పెట్టారంటూ టీపీసీసీ కోఆర్డినేటర్ తిరుమల వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైం పోలీసులు ఈ నెల 18న కేసు నమోదు చేశారు.
రేవంత్‌రెడ్డితోపాటు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు ఆరోపించా రు. ఈ ఫిర్యాదుపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 352, 353(1)(బీ) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో క్రిషాంక్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ కేసు విచారణను నిలిపివేయాలని 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశించింది.