రంగారెడ్డి, జనవరి 26 (నమస్తేతెలంగాణ) : ఫ్యూచర్‌సిటీ పేరుతో ప్రభుత్వం అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్నదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఫ్యూచర్‌సిటీ పేరుతో ప్రభుత్వం పేదల భూములను బలవంతంగా గుంజుకొని రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీకోసం భూసేకరణ చేపడితే అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఇప్పుడు అవే భూములు ఫ్యూచర్‌సిటీకి దిక్కయ్యాయని ఆరోపించారు.
భూసేకరణ పేరుతో పేదల భూములను బలవంతంగా గుంజుకొని, వారిని రోడ్డున పడేస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. యాచారం మండలం నందివనపర్తి, నజ్దిక్‌సింగారం గ్రామాల్లో 1,450 ఎకరాల దేవాలయ భూములు, కొత్తపల్లిలో దళితుల అసైన్డ్ భూములు, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో పే దల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. నందివనపర్తి ఓంకారేశ్వరస్వామి ఆలయ భూములను తీసుకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.