కరీంనగర్ కలెక్టరేట్, మార్చి 18: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది వారి పరిస్థితి. హైకోర్టు ఆదేశించినా, ఉద్యోగావకాశాలు రాలేదు. లక్షలాది కుటుంబాలకు తాగు, సాగు నీరందించేందుకు తమ విలువైన భూములను త్యాగం చేసినా, వారి జీవన నావ ముందుకు సాగటం లేదు. ఉన్న ఊరు నీటితో నిండిపోతే, పొట్ట చేత పట్టుకుని చెట్టు కొకరు. పుట్ట కొకరు అన్నట్లుగా విడిపోయినా వారి కందించాల్సిన భరోసా అప్పటివరకు అందలేదు. వారి పిల్లలు పెరిగి పెద్దవారై తమ కుటుంబాలకు జరిగిన అన్యాయంపై కోర్టు మెట్లు ఎక్కటంతో బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చినా, అధికారులు తమకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా తిరకాసు పెట్టారని దిగువ మానేరు భూనిర్వాసిత అభాగ్యులు అవేదన వ్యక్తం చేస్థూ, కలెక్టర్ ను ఆశ్రయించారు.
ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులైన వారికి నీటి పారుదల శాఖలో జీవో ఎంఎస్ నం.98 ప్రకారం ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో, ముంపు గ్రామాలకు చెందిన వందలాది మంది నిరాశ్రయులు తమకు ప్రభుత్వం ఉద్యోగమిస్తుందనే సంతోషంతో ధరఖాుస్తులు చేసుకున్నారు. వీరిలో కొద్దిమందికి మాత్రమే అవకాశం కల్పించి, మిగతా వారికి మొండిచేయి చూపింది. దీందో, అర్హులైన అనేక మంది ఇటు ఇరిగేషన్, ఆటు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. 514 మంది న్యాయస్థానం గుమ్మం తొక్కారు. తమకు జరిగిన అన్యాయంపై న్యాయమూర్తిని వేడుకున్నారు. దీంతో, స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి 241 మందికి ఎనిమిది వారాల్లోపు ప్రాజెక్టు పరిధిలోని కార్యాలయంలో గల వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, ఆటెండర్లు, లస్కర్, వర్క్ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెకానికల్, డ్రైవర్ తదితర ఉద్యోగావకాశాలు కల్పించాలంటూ గతేడాది సెప్టెంబర్లో డబ్ల్యుపీ నం.32260/2024 ద్వారా ఆదేశాలు జారీ చేసింది. అయితే, వెంటనే స్పందించి కోర్టు ఉత్తర్వులు అమలు చేయాల్సిన సదరు అధికారులు కొర్రీలు పెట్టి యత్నాలు చేస్తున్నారని ఉద్యోగార్థులు ఆరోపిస్తున్నారు. కేసుల సీనియార్టీ ప్రాతిపదికనా?! లేక అవార్డులు పొందిన తేదీ ప్రాతిపదికనా? ఉద్యోగావకాశాలు కల్పించే అంశంపై వివరణ కోసం ఈఎన్సీ ఆడ్మిన్కు ఈ ఏడాది జనవరిలో స్థానిక ఇరిగేషన్ అధికారులు లేఖ రాశామంటూ మరో మెలిక పెట్టారు.
ఈ అంశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో బాధిత ఉద్యోగార్థులు నిత్యం నీటి పారుదల శాఖ కార్యాలయానికి చెప్పులరిగేలా తిరుగుతున్నారు. అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పకుండా హైదరాబాద్ నుంచి లిఖితపూర్వక ఆదేశాలు వచ్చిన అనంతరమే తాము సమాచారమిస్తామంటూ చెబుతున్నట్లు వాపోతున్నారు. వాస్తవానికి కోర్టు ఉత్తర్వులనుసరించి ఎలాంటి కేసులు లేకుండా ఉన్న వారికి సత్వరమే ఉద్యోగ ఉత్తర్వులు అందజేయాల్సి ఉంటుంది. ఆశాఖలో ఉన్న ఖాళీల్లో వీరికి కేటాయించనున్నట్లు కూడా వెల్లడించారు. తీరా కోర్టు ఉత్తర్వులు వచ్చిన అనంతరం నియామకాలు చేయకుండా వెనుక అంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. ముందుగా వీరికి ఉద్యోగాలు కేటాయిస్తే, కోర్టులో పెండింగులో ఉన్న మిగతా వారిని అకామిడేట్ చేయటం ఇబ్బందవుతుందనే కారణంతో ఈఎన్సీ ఆడ్మిన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని పలువురు ఉద్యోగార్థులు ఆరోపిస్తున్నారు.
ఓవైపు తమకు వయసుడిగిపోతుండగా, హైకోర్టు ఆదేశించినా ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తుండటంపై మండిపడుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులమేరకు ఇంటిగ్రేటెడ్ సీనియార్టీ జాబితాలో మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ, వెంటనే ఉద్యోగావకాశాలు కల్పించాలంటూ, మారు 50 మందికి పైగా ఉద్యోగార్థులు కరీంనగర్ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను పిలిచి సత్వర న్యాయం చేయాలంటూ ఆదేశించినట్లు వారు తెలిపారు.