RTC Strike | హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపుపై సంస్థ యా జమాన్యం చేతులెత్తేసినట్టు తెలుస్తున్నది. కార్మిక సంఘాలు ఇచ్చిన నోటీసు ప్రకారం సమ్మెకు ఇంకా రెం డు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం లేదా సోమవారం ఉదయం ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని భావిస్తున్నా ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఆ దిశగా ఎటువంటి సంకేతాలు వెలువడటం లేదు. దీంతో సమ్మె తథ్యమనే భావన నెలకొన్నది. అయితే, సమ్మెపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడినట్టు ఓ వర్గం మీడియా కథనాలు ఇవ్వగా.. అవన్నీ అవాస్తవాలని తేలిపోయింది. మంత్రి చర్చల్లో సమ్మె ప్రస్తావనే రాలేదని విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఇక ముఖ్యమంత్రి మాత్రమే ఆర్టీసీ సమ్మెపై నిర్ణయం తీసుకోగలరని ఊహాగానాలు వెలువడ్డాయి.
రెండు ప్రధాన డిమాండ్లు
ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్లలో ప్రధానమైనవి ఒకటి తమను ప్రభుత్వంలో విలీనం చేయడం, రెండోది కార్మిక సంఘాలపై నిషేధం ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం. ఈ రెండు మినహా మిగిలిన డిమాండ్లను పరిష్కరించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. రెండు ప్రధాన డిమాండ్లపై ముఖ్యమంత్రి ఇచ్చే హామీని బట్టి సమ్మె ఆధారపడి ఉంటుందని ఇటు ప్రభుత్వ పెద్దలు, అటు కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు.
చర్చలకు పిలువకపోతే సమ్మె తథ్యం..
తాము ఇచ్చిన సమ్మె డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించకపోతే సమ్మె తథ్యమని ఆర్టీసీ కార్మిక సంఘాలు తేల్చి చెప్తున్నాయి. తాము ప్రధానంగా ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించే వరకు వెనుకకు తగ్గేది లేదని హెచ్చరిస్తున్నాయి. అన్ని సమస్యలను పరిష్కరించాల్సిందేనని నాయకులు అంటున్నారు. ఆర్టీసీ సంస్థకు ఆర్థిక భారం కాకుండా.. నిధులు ఎలా సమకూర్చుకోవాలో సీఎం తమను చర్చలకు పిలిస్తే.. తామే చెప్తామని అంటున్నారు. యాజమాన్యం ఇకనైనా నిరంకుశ వైఖరి వీడి.. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.