వరంగల్, ఫిబ్రవరి 25 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్, హన్మకొండ జిల్లాలలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంపై హన్మకొండ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు.
ముందుగా అధికారులు ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన చర్యలను వివరించారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తమ సూచనలు, సలహాలు ఇచ్చారు. స్కూల్స్ ఎంపికలో తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? పథకం అమలు పై అధికారుల చర్యలేంటి? అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది? ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా? వంటి పలు అంశాల పై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. మండలాన్ని యూనిట్ గా తీసుకోవాలన్నారు.కాగా, ప్రతి పాఠశాలలో నిరంతరం నీరు, మరుగుదొడ్లు, విద్యుత్, మంచినీరు, ఫర్నీచర్, ప్రహరీ గోడలు, వంట గది, అదనపు గదుల, మరమ్మతులు, డిజిటల్ వంటి అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
పాత భవనాలను అధునికరించాలని మంత్రి అన్నారు
వనరుల నిర్వహణకు కమిటీ వేసి, నిధుల నిర్వహణ కోసం ప్రత్యేక ఖాతాను ఏర్పాటు చేసుకోవాలన్నారు. దాతలతో నిధులు సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థను బాగు చేసి, విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విధంగా చేయాలని మంత్రి ఆదేశించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ జెడపీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు నర్సిరెడ్డి, బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మా రెడ్డి, అరురి రమేశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం జనగామ జిల్లాలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం పై జనగామ కలెక్టరేట్ ల్ మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కర్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగామ మున్సిపాలిటీ చైర్ పర్సన్ జమున, జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, తదితరులు పాల్గొన్నారు.