కరీంనగర్ విద్యానగర్, డిసెంబర్ 2: బీమా డబ్బుల కోసం సొంత అన్ననే హత్యచేసిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగులో చోటుచోసుకున్నది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్లో సీపీ గౌష్ ఆలం వెల్లడించారు. రామడుగుకు చెందిన మామిడి నరేశ్(30) పలు వ్యాపారాలు చేసి రూ.1.5 కోట్ల అప్పుల్లో చిక్కుకున్నాడు. వాటిని తీర్చేమార్గం కనిపించక మానసిక పరిపక్వత లేని, అవివాహితుడైన తన పెద్దన్న మామిడి వెంకటేశ్ (37)ను అస్త్రంగా భావించాడు.
ఇందులో భాగంగా వెంకటేశ్ పేరుపై వివిధ కంపెనీల్లో మొత్తం రూ.4.14 కోట్లకుపైగా పాలసీలు తీసుకున్నాడు. యాక్సిస్ బ్యాంకులో వెంకటేశ్ పేరిట రూ.20 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నాడు. తన అన్న చనిపోతే ఈ లోన్లు మాఫీ అవుతాయని, వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో బాకీలు తీరుతాయని అనుకున్నాడు.
వెంకటేశ్‌ను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని పథ కం వేసిన నరేశ్ తన స్నేహితుడైన నముండ్ల రాకేశ్, టిప్పర్ డ్రైవర్ మునిగాల ప్రదీప్‌తో ఒప్పందం చేసుకున్నాడు. నవంబర్ 29న రాత్రి మామిడి నరేశ్, ప్రదీప్ సహకారం తో పథకం అమలుచేసి, జాకీ విప్పు తున్న అన్నపైకి టిప్పర్‌ను నడిపించి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పంచనామాచేసి, సాక్ష్యాలు సేకరించారు. మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.