సమాఖ్య స్ఫూర్తిని కాపాడుదాం
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మమతా బెనర్జీ ఫోన్
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించటంపై చర్చ
మార్చి 3న వారణాసి ర్యాలీలో పాల్గొంటా
ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపు
హైదరాబాద్, ఫిబ్రవరి 14 : ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పోరాటం తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఇతర రాష్ర్టాల ముఖ్యనేతలు కూడా ఆయన వెంట నడిచేందుకు ముందుకొస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సోమవారం ఫోన్‌చేసి మాట్లాడారు. బీజేపీ సర్కారు దేశంలో ప్రజాస్వామ్య, సమాఖ్యస్ఫూర్తిని కాలరాస్తూ, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నదని, దీనిని అడ్డుకొనేందుకు దేశాన్ని ఏకం చేయాల్సిన అవసరం ఉన్నదని మమత అభిప్రాయపడ్డట్టు తెలిసింది. అనేక ప్రాంతీయ పార్టీల నేతలు తనతో మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు. ‘మమతా బెనర్జీ నాతో ఫోన్లో మాట్లాడారు. నన్ను బెంగాల్‌కు ఆహ్వానించారు. బెంగాల్లోనో, హైదరాబాద్‌లోనో కలుసుకొని చర్చిస్తాం’ అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే మమత సీఎం కేసీఆర్‌కు మరోసారి ఫోన్ చేయటం గమనార్హం. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగడుతున్నామని, అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌తోపాటు తమిళనాడు సీఎం స్టాలిన్‌తోనూ ఫోన్లో మాట్లాడానని మమతా బెనర్జీ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు వచ్చేనెల 3న వారణాసి ఎన్నికల ర్యాలీలో పాల్గొంటానని ఆమె తెలిపారు. ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్‌కు సత్సంబంధాలు లేవని, అందువల్ల ప్రాంతీయ పార్టీలు తమ దారిలో తాము వెళతాయని పేర్కొన్నారు.