Supreme Court : పశ్చిమబెంగాల్ (West Bengal) లో నిర్వహిస్తోన్న ‘సర్’ ప్రిక్రియ (SIR Process) ను వ్యతిరేకిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సర్ ప్రక్రియలో ఏవైనా ఆదేశాలు, స్పష్టత అవసరమైతే తాము కల్పించుకుంటామని స్పష్టంచేసింది. అంతేతప్ప సర్ ప్రక్రియకు అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేయవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవాలని సూచించింది.
ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) ప్రక్రియ కోసం 300 మంది అధికారులను కేటాయించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోరితే 80 మంది గ్రేడ్-2 స్థాయి అధికారులనే కేటాయించిందని న్యాయస్థానానికి ఈసీ తెలియజేసింది. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, అర్హులైన ప్రజలను ఓటర్ల జాబితాల్లో చేర్చడంలేదని బెంగాల్ ప్రభుత్వం పేర్కొన్నది. ఇంటి పేర్లలో అక్షరదోషాలు, వివాహం తర్వాత మహిళల చిరునామాలలో మార్పు వంటి చిన్న లోపాలను సాకుగా చూపి ఓట్లు తొలగిస్తున్నారని ధర్మాసనానికి తెలిపింది.
సర్ ప్రక్రియవల్ల 1.36 కోట్ల మంది ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేసింది. తమ స్థానికతను నిరూపించుకోవడానికి ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని బెంగాల్ సర్కార్ న్యాయస్థానానికి తెలియజేసింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్రంలో ఓటర్ల దరఖాస్తులు పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి గడువును ఒక వారం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.