– కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సర్పంచ్, పాలకవర్గ సభ్యులు
బీబీనగర్, ఫిబ్రవరి 9 : బీబీనగర్ మండలంలోని పడమటిసోమారం గ్రామ సర్పంచ్ బద్దం అంజయ్యకు శ్రీ లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన డోర్ పోస్టర్లు, కరపత్రికలలో ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన గ్రామ సర్పంచ్ పేరు కావాలని తొలగించారని గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై పడమటిసోమారం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆ లేఖలో, ఆలయ ఈఓను ప్రశ్నించగా “అధికార పార్టీ నేతలు చెప్పిన విధంగానే కరపత్రికలు ముద్రించాను” అని సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ అండతో గ్రామ సర్పంచ్‌ను కేవలం ఆయన విపక్ష పార్టీకి చెందినవారనే కారణంతో, అలాగే దళిత వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే బ్రహ్మోత్సవాల నిర్వహణలో పక్కన పెట్టడం అత్యంత అమానుషమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రథమ పౌరుడైన సర్పంచ్‌కు ఇలా అవమానం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ ఈ వ్యవహారంపై ఆలయ ఈఓ నరేందర్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను వారు డిమాండ్ చేశారు. ఇలాంటి వివక్షతా ధోరణి కొనసాగితే దానికి తగిన పరిణామాలను సంబంధిత అధికారులు ఎదుర్కోవాల్సి ఉంటుందని గ్రామ పంచాయతీ పాలకవర్గం హెచ్చరించింది.

దళిత సర్పంచ్‌కు అవమానం