హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఆరోగ్యం మరింత క్షీణించింది. గత కొన్ని రోజుల నుంచి ఆమె బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో ఐసీయూకి తనను మార్చారు.
మల్లు స్వరాజ్యం చిన్నతనంలో గుర్రపు స్వారీ, కత్తియుద్ధం లాంటి విద్యల్లో ప్రావీణ్యం సంపాదించింది. ఈమె తల్లిదండ్రులు స్వాతంత్య్రోద్యమ కాలం నాటి ‘స్వరాజ్’ అనే నినాదం పట్ల ప్రభావితులై తనకు స్వరాజ్యం అనే పేరు పెట్టారు.
ఈమె విప్లవ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన నవల మదర్ (మాక్సిమ్గోర్కీ). వెట్టిచాకిరీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ పిలుపు మేరకు ఉద్యమాలు చేసింది. వెట్టిచాకిరీ బాధితులకు బియ్యాన్ని పంపిణీ చేసింది. తర్వాతి కాలంలో జమీందారీ వ్యవస్థ వ్యతిరేక ఉద్యమంలో దళకమాండర్‌గా పనిచేసింది. అందుకుగాను నిజాం ప్రభుత్వం ఈమె తలకు పదివేల రూపాయల నజరానా ప్రకటించింది.
ఈమె కమ్యూనిస్టు సాయుధ పోరాట పరిధిని విస్తరించి జమీందారుల నుంచి భూమిని లాక్కొని పేదలకు పంపిణీ చేసింది. 1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘానికి ఉపాధ్యక్షురాలిగా మల్లు స్వరాజ్యం పనిచేశారు.