హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఎంపీలు కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. గురువారం ప్రజాభవన్‌లో డిప్యూ టీ సీఎం నేతృత్వంలో ఎంపీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన పథకాలపై పార్లమెంట్లో ఎంపీలు లేవనెత్తాలని సూచించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం 9వ షెడ్యూల్లో సవరణ జరగాలని, ఈ అంశంపై పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చకు తీసుకురాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికుల సమస్యలపై దృష్టిసారిస్తామని, వారి సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్‌రెడ్డి, ఆర్టీసీ ఎండీతో మాట్లాడుతానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కార్మిక సంఘం నేతలకు హామీ ఇచ్చారు. గురువారం గాంధీభవన్‌లో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖిలో పాల్గొన్న ఆయనకు.. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్(ఐఎన్టీయూసీ) జనరల్ సెక్రటరీ కే రాజిరెడ్డి వినతిపత్రం అందజేశారు.
హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ)ః రాష్ట్రంలో సింగిల్ లేన్, డబుల్ లేన్, ఫోర్‌లేన్ రోడ్లు ఎన్ని ఉన్నాయనే దానిపై సమగ్ర నివేదిక రూపొందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే పదిహేనేండ్ల ట్రాఫిక్ అంచనాలకు అనుగుణంగా యాక్షన్‌ప్లాన్ ఉండాలని స్పష్టంచేశారు. వచ్చేనెల 8,9తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో ఆర్‌అండ్‌బీశాఖ విజన్-2047 డాక్యుమెంట్‌ను ప్రదర్శించాలని సూచించారు. గురువారం ఎర్రమంజిల్‌లో ఆర్‌అండ్‌బీశాఖ కార్యాలయం లో ఆర్అండ్బీ విజన్-2047పై అధికారులతో సమీక్ష నిర్వహించారు.