హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ లాబీలో మంగళవారం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలపై ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్లమెంట్లో వాజపేయి లాంటి వారు మాట్లాడుతుంటే ప్రజలు ఆసక్తిగా చూసేవారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు హత్తుకుపోయేవారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడుతారోనని ఆసక్తి ఉండేదని, కానీ ప్రస్తుతం అసెంబ్లీలో ‘బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే’ కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ లాబీలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మధ్య సరదా సంభాషణ కొనసాగింది. ఒకరిపై ఒకరు చలోక్తులు విసురుకున్నారు. వివేక్‌ను ‘నమస్తే మంత్రి గారు’ అని మల్లారెడ్డి పలుకరించగా, దీనికి స్పందించిన వివేక్.. థ్యాంక్స్ మల్లన్నా అంటూ సమాధానమిచ్చారు. అనంతరం మల్లారెడ్డి.. రాష్ట్రంలో కోమటిరెడ్డి, వెంకటస్వామి ఫ్యామిలీల హవా నడుస్తున్నదని అన్నారు. వివేక్ స్పందించి.. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, మల్లారెడ్డిదే నడిచిందిగా.. అని జవాబిచ్చారు. దీనికి మేము అధికారం కోల్పోయాం.. మాదేం లేదన్నా అని మల్లారెడ్డి రిైప్లె ఇవ్వడంతో ఇద్దరి మధ్య నవ్వులు విరిచాయి.