Congress | యాదగిరిగుట్ట, మార్చి11: అధికారంలోకి రాగానే సాగు నీళ్లందిస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, కానీ గెలిచిన తర్వాత నీళ్లివ్వకుండా పంటలు ఎండబెడుతున్నదని రైతులు మండిపడుతున్నారు. గ్రామంలో సాగు నీళ్లు లేక, లో ఓల్టేజీ సమస్యతో 150 ఎకరాల్లో వరి పొలాలు ఎండిపోయాయని యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం మల్లాపురం రైతులు కాంగ్రెస్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ అమ్మమ్మ వాళ్ల ఊరని, గెలిచిన వెంటనే గోదావరి జలాలను కాల్వ ద్వారా అందిస్తానని స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాడని, కానీ ఇప్పుడు పంటలు ఎండిపోతున్నా ఇటు వైపు చూడటం లేదని మండిపడుతున్నారు. నమ్మి ఓట్లేస్తే నట్టేట ముంచాడని వాపోయారు.
మల్లాపురం గ్రామ పంచాయతీ పరిధి సురెండెం బావి ప్రాంతంలో 25 మంది 150 ఎకరాల్లో వరి వేయగా నీళ్లు లేక, లోఓల్టేజీ సమస్యతో పంటలు ఎండిపోయాయి. ఎండిన పంటలను పశువుల మేతకు వదలాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు కర్రె ఎల్లమ్మ, మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన వరి పంటలను మంగళవారం బీఆర్ఎస్ యాదగిరి గుట్ట మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్యతోపాటు ఆ పార్టీ నాయకులు పరిశీలించారు.
కాంగ్రెస్‌ను గెలిపిస్తే గ్రామానికి నీళ్లిస్తామని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య నమ్మించి ఓట్లేసుకున్నడు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం కాల్వ నుంచి నీళ్లు వస్తాయని నాకు ఉన్న రెండెకరాల భూమిలో వరి వేసిన. రెండు నెలలుగా బావివద్దనే ఉంటున్న. కానీ ఒక్క చుక్క నీళ్లురాలె. కరెంటు కూడా సరిగ్గా వస్తలేదు. నాకు రూ.2 లక్షల క్రాప్‌లోన్ ఉంది. కానీ రుణమాఫీ కాలేదు. రైతు భరోసా ఇస్తలేరు. కాంగ్రెస్ సర్కార్ రైతులను నానా ఇబ్బంది పెడుతున్నది.
-కర్రె ఎల్లమ్మ, రైతు, మల్లాపురం, యాదగిరి గుట్ట మండలం