Nalgonda | ఖైరతాబాద్, నవంబర్ 25 : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం ఇరికిగూడెం గ్రామానికి చెందిన లొట్లపల్లి సావిత్రమ్మ అనే 75 ఏండ్ల వృద్ధురాలు తన భూమిని కొందరు గ్రామస్తులు కబ్జా చేశారని ఆరోపించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. 1984లో తన తల్లి కోటిక లచ్చమ్మ ద్వారా 2.10 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. నాటి నుంచి సాగుచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. భర్త చనిపోగా కొడుకు, కుమార్తె ఉన్నారు. పొలం సాగుచేయగా వచ్చిన డబ్బుతోనే కూతురు పెండ్లి చేశాను. కొడుకు మానసిక పరిస్థితి సరిగా లేక అతని ఆలనాపాలన చూసుకుంటున్నా. ఈ క్రమంలో ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రెండేండ్లపాటు భూమిలో పంట వేయలేదు. ఇదే అదునుగా గ్రామానికి చెందిన కొందరు 2018లో నకిలీ పాసుపుస్తకాలు, పట్టా సర్టిఫికెట్లతో తన భూమిని ఆక్రమించుకున్నారు.
దీంతో కలెక్టర్ వద్దకు వెళ్లి ట్రిబ్యునల్‌లో తమ గోడు వెల్లబోసుకోగా, తహసీల్దార్ అన్ని పత్రాలు పరిశీలించి రిపోర్టు తయారు చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో తహసీల్దార్ విచారణ జరిపించి కబ్జా చేసినట్టు గుర్తించి వారి నకిలీ పట్టాలు, పాసుపుస్తకాలను రద్దు చేయించారు. కానీ, ఆ భూమి తనదేనని రిపోర్టు తయారు చేయలేదు. తనకు జరిగిన అన్యాయంపై 2020లో మిర్యాలగూడ కోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం ఆ కేసు నడుస్తున్నది. తనకు రిపోర్టు కాపీ ఇవ్వకుండా, ట్రిబ్యునల్ ఆర్డర్‌ను అమలుపర్చకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని వాపోయింది. తన భూమి కబ్జా వెనుక నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఉన్నాడని సావిత్రమ్మ ఆరోపించింది. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని, నూతన పట్టాదారు పాస్‌పుస్తకం అందజేయాలని వేడుకున్నది.