నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 12: మక్క రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. పంటను అమ్ముకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ రైతులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. మంగళవారం పలు జిల్లాల్లో మక్క రైతులు రోడ్డెక్కారు. ‘సుమారు ఆరు వేల బస్తాలకు ఆరుగురు హామీలు అన్లోడ్ చేస్తే.. తమ ట్రాక్టర్ సీరియల్ వచ్చేది ఎప్పుడు? అన్లోడ్ అయ్యేది ఎన్నడు?’ అంటూ మక్క రైతులు హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథినిలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. కాగా నందనం సొసైటీ ఆధ్వర్యంలో రెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన అన్లోడింగ్ పాయింట్‌ను వద్ద సైతం సుమారు 100 ట్రాక్టర్ల వరకు అన్లోడ్ కావాల్సి ఉండగా జాప్యం నెలకొందని రైతులు మండిపడ్డారు. అనంతరం రైతులు రెడ్డిపాలెం-నందనం రోడ్డుపై రాస్తారోకో చేశారు. 20 రోజుల క్రితం మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకొస్తే కాంటా వేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ అనుబంధ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని బుగ్గవాగు వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం, మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ సెంటర్ వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు. మండుటెండను లెక్క చేయకుండా బ్రాహ్మణపల్లికి చెందిన రైతు చేపూరి వెంకటనారాయణ రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ.. మండలంలో సుమారు 5.73 లక్షల క్వింటాళ్ల మకజొన్న దిగుబడి వస్తే.. ప్రభుత్వం కేవలం 2.30 లక్షల క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసిందని మండిపడ్డారు. అకాల వర్షాలతో కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు ఎప్పుడు తడిసిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నా.. ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మక్కలు తేవద్దంటూ బోర్డులు
కష్టపడి పండించిన మక్కజొన్నను అమ్ముకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. కాంటా వేసినా మక్కలు గోదాములకు తరలించేందుకు రవాణా సమస్యతో తలెత్తడంతో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా మార్కెట్లోనే నిల్వ ఉంచారు. కొనుగోలు చేసిన మక్కను సకాలంలో తరలించకపోవడంతో కాపాలా ఉండాల్సిన దుస్థితి నెలకొన్నదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరుగడం లేదంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట ఉత్పత్తులను ప్రణాళికాబద్ధంగా కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే చేతులెత్తేయడంతో మార్కెట్లలో తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని అన్నారు. మార్కెట్లలో స్థలం లేకపోవడంతో మక్కలు తెచ్చేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. అయితే నాగర్‌కర్నూల్ మార్కెట్లో ఈనెల 14వ తేదీ వరకు మక్కను మార్కెట్‌కు తీసుకురావద్దని బోర్డును ఏర్పాటు చేయడం గమనార్హం.
తొగుటలో దున్నపోతుతో నిరసన
సిద్దిపేట జిల్లా తొగుట మార్కెట్ యార్డుకు పొద్దుతిరుగుడు పంటను తెచ్చి 40 రోజులైనా కొనకపోవడంతో సహనం నశించిన రైతులు మంగళవారం దున్నపోతుతో కలిసి నిరసన చేపట్టారు. వ్యవసాయ మార్కెట్ నుంచి తహసీల్ కార్యాలయం వరకు దున్నపోతుతో ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు. తహసీల్ ఆఫీస్ ఎదుట పొద్దు తిరుగుడు ధాన్యాన్ని పోసి ఆందోళనకు దిగారు.
యూరియా లింక్‌ను నిరసిస్తూ సొసైటీకి తాళం..
నిజామాబాద్ జిల్లా పొతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డోలి రైతులు సొసైటీ కార్యాలయానికి తాళం వేశారు. మందుల కోసం వెళ్తే నానో లిక్విడ్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు బస్తాల ఎరువులు తీసుకుంటే ఒక నానో లిక్విడ్ బాటిల్ తీసుకోవాలనే నిబంధన పెట్టడం వల్ల తమపై ఆర్థిక భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు.

మక్కలు కొనాలని మహబూబాబాద్ జిల్లా గూడూరులో రాస్తారోకో చేస్తున్న రైతులు

పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయకపోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా తొగుటలో మార్కెట్ యార్డు నుంచి తహసీల్దార్ కార్యాలయానికి దున్నపోతుతో వెళ్తున్న రైతులు

నానో యూరియాను అంటగట్టడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం హెగ్డోలి సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలుపుతున్న రైతులు