సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో జీరో దందా పేరుతో జరుగుతున్న అక్రమ వ్యాపారం రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది. వినియోగదారులకు సరైన పన్ను బిల్లు ఇవ్వకుండా కేవలం తెల్ల కాగితాలపై చేతిరాత బిల్లులు ఇచ్చి సరుకులు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడటమే కాకుండా వినియోగదారుల హకులు కూడా దెబ్బతింటున్నాయి.
సిద్దిపేట, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అనేక దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు నిత్యావసర వస్తువులు, ఇతర ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. బిల్లు అడిగితే కంప్యూటర్ బిల్లు కాకుండా సాధారణ కాగితంపై మొత్తం రాసి ఇస్తున్నారు.వస్తువులో లోపం ఉంటే మార్చుకోవడం, ఫిర్యాదు చేయడం కూడా కష్టమవుతోంది. మరో వైపు, నాణ్యత లేని లేదా గడువు తేదీ సమీపంలో ఉన్న ఉత్పత్తులు కూడా విక్రయిస్తున్నారు.సరైన బిల్లు లేక వినియోగదారులు చట్టపరంగా తమ హకులు వినియోగించుకునే అవకాశం కోల్పోతున్నారు. స్థానిక వ్యాపారుల్లో కొందరు పన్నుఎగవేత కోసం అధికారిక బిల్లింగ్ వ్యవస్థను పకనబెడుతున్నారు.
వాణిజ్య పన్నుల శాఖ, జీఎస్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ శాఖ, వినియోగదారుల వ్యవహారాలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారా…? అది ఎక్కడా జరగడం లేదు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా లేవు. జిల్లా కేంద్రాలతోపాటు నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో రోజురోజుకూ జీరో దందా జోరందుకుంది. వ్యాపారులు ప్రభుత్వానికి చెల్లించే జీఎస్టీ, సేల్స్‌ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్‌లను ఎగ్గొడుతూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. అధికారుల అజమాయిషీ, ఆకస్మిక తనిఖీలు లేక జీరో వ్యాపారం ‘మూడు పూలు, ఆరు కాయలు’గా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం కోట్లల్లో వ్యాపారం జరుగుతుండగా అంతే విలువ చేసే సరుకులు ఎలాంటి బిల్లులు లేకుండానే దుకాణాలకు చేరుతున్నాయి.
అధికారుల అజమాయిషీ కొరవడటం వల్ల ఉమ్మడి జిల్లాలోని ప్రతి కిరాణం, ఎలక్ట్రికల్, మెడికల్, ఫర్టిలైజర్, జనరల్ స్టోర్స్ తదితర దుకాణాల్లో నాణ్యత లేని సరుకుల విక్రయాలు జరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నకిలీ సరుకులు తెప్పించి జోరుగా విక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సిద్దిపేట జిల్లాలో దుకాణాలు నడుపుతున్న వారు జీరో దందాతో పాటు పలు బ్రాండ్ల పేరుతో నకిలీ వస్తువులు సైతం విక్రయిస్తున్నట్లు సమాచారం. చిప్స్, బోందీ, ఖారా, స్నాక్స్ తదితర పిండి పదార్థ్ధాలతో పాటు జనరల్ సామగ్రిలోనూ నాణ్యతలేనివి అమ్ముతున్నారు. ప్రముఖ బ్రాండ్లను కాపీ కొడుతూ నిత్యావసర సరుకులు, గుట్కా, సిగరెట్, బట్టలు, ప్లాస్టిక్ వస్తువులు, స్టీల్ ఉత్పత్తులు, మొబైల్స్, ఐరన్, సిమెంట్, మెడికల్ విక్రయాలు జీరో మాల్ ద్వారా ఎలాంటి బిల్లులు లేకుండా లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారు.
జీరో దందాను బట్టబయలు చేయాలంటే టాస్క్‌ఫోర్స్, విజిలెన్స్, పోలీస్ అధికారుల బృందం ద్వారానే సాధ్యమవుతుందని పలువురు వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. అక్రమ సరుకుల రవాణా, జీఎస్టీ ఎగవేత, నకిలీ, నాణ్యతలేని సరుకులు, వస్తువుల విక్రయాలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో నకిలీ వస్తువుల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి వాటిపై దాడులు చేయాల్సిన అవసరం ఉంది. విస్తృత తనిఖీలు, దాడుల ద్వారానే జీరో మాల్ దందాకు, నకిలీ వస్తువుల తయారీకి అడ్డుకట్ట వేయవచ్చని, ఆదిశగా ఉన్నతాధికారులు చర్యలు చేపడుతారో లేదో వేచి చూడాలి.
జీఎస్టీ నిబంధనల ప్రకారం ప్రతి దుకాణంలోనూ దుకాణం పేరుతో బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏ దుకాణంలోనూ ప్రింటెడ్ బిల్లులు కనిపించడం లేదు. వేల రూపాయల్లో సరుకులు కొన్నప్పటికీ తెల్ల కాగితాలపైనే బిల్లులు ఇస్తారు తప్పా జీఎస్టీ బిల్లులు ఇవ్వడం లేదు. సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి జిల్లా కేంద్రాలతో పాటు చుట్టుపక్కల మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇదేతంతు జరుగుతోంది. రాజస్థాన్, కర్ణాటక, హైదరాబాద్, గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి కోట్ల రూపాయల సరుకులు దిగుమతి అవుతున్నాయి. వీటికి కూడా బిల్లులు ఉండకపోవడం గమనార్హం. బిల్లులు లేక జీఎస్టీ పరిధిలోకి రావు. దీంతో లక్షల్లో జీఎస్టీ ఎగవేతలు జరుగుతున్నాయి.
ఉమ్మిడి మెదక్ జిల్లాలో వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, దుకాణ సముదాయాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే వ్యాపారులు జీరో దందాకు తెరలేపుతున్నారనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కమర్షియల్ ట్యాక్స్, సేల్స్‌ట్యాక్స్, జీఎస్టీ, విజిలెన్స్, పోలీస్‌శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో జీరో వ్యాపారానికి అడ్డులేకుండా పోయింది. జిల్లాలోని ప్రధాన పట్టణాల నుంచి చుట్టుపక్కల పట్టణాలకు సైతం జీరో సరుకులు రవాణా చేస్తూ కోట్లల్లో వ్యాపారం సాగిస్తున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మాముళ్ల మత్తులో ఉన్న అధికారులు జీరో దందాను అరికట్టలేకపోతున్నారనే ప్రచారం జోరందుకుంటోంది. వివిధ వ్యాపారాలకు సంబంధించి సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ సంఘాల ప్రతినిధుల ద్వారా అధికారులకు నెలనెలా మాముళ్లు పంపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యాపార, వాణిజ్య సంస్థలపై ఆకస్మిక తనిఖీలు చేసి ఆడిట్ చేయని వారిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.