సిటీబ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): వాహనాల రద్దీ కారణంగా కాలుష్యంతో నిండిపోయిన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నగరంలో ఈవీ చార్జ్జింగ్ స్టేషన్ల నిర్వహణను చూడాల్సిన రెడ్కో సంస్థ.. నిర్వహణను గాలికొదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఈవీ స్టేషన్లలో యూనిట్ ధరలు భారీగా వ్యత్యాసం చూపిస్తుండటం, నిర్వహణ సరిగా లేకపోవడం, చార్జింగ్ స్టేషన్లు మూసివేసి ఉండటం తదితర కారణాలతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులు చార్జి ంగ్ కోసం అవస్థలు పడుతున్నారు. మహానగరంలో 160 ఫాస్ట్ ఈవీ స్టేషన్లను రెడ్కో నిర్వహిస్తున్నది.
ఆయా స్టేషన్లలో ఈవీ వాహనదారులు యూనిట్ల వారీగా డబ్బులు చెల్లించి వినియోగించుకోవాలి. అయితే ఇందులో సగానికిపైగా పనిచేయడం లేదని, కొన్నిచోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో చార్జింగ్ మధ్యలోనే నిలిచిపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. వనస్థలిపురం చార్జింగ్ స్టేషన్లో గంట చార్జింగ్ పెడితే కేవలం 2 యూ నిట్లు మాత్రమే చార్జింగ్ అవుతుందని తెలిపారు. సాధారణంగా గంటలో 95శాతం వరకు చార్జింగ్ ఫూర్తికావాలి.సంబంధిత కంపెనీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని సమాచారం. సాధారణంగా కారుకు కెపాసిటీ ఆధారంగా యూనిట్లవారీగా చార్జింగ్ అవసరం పడుతుంది. 75 కిలో వాట్స్ సామర్థ్యం ఉన్న కారుకు సుమారు 80 యూనిట్ల చార్జింగ్‌తో ఫుల్ బ్యాటరీ అవుతుంది.
ఒక్కో స్టేషన్లో ఒక్కో ధర..
ధరలు సైతం ఒక్కో ఈవీ స్టేషన్లో ఒక్కో విధంగా ఉండటం కూడా వాహనదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి. రెడ్కో పర్యవేక్షించే స్టేషన్లో యూనిట్‌కు రూ.12 ఉంటే, ప్రైవేట్ బంక్‌ల్లో రూ.14గా ఉంది. మరికొన్నింటి లో రూ.17 వసూలు చేస్తున్నారు. 2023-24లో సుమారు 1.25 లక్షల నుంచి 2024-25 నాటికి 2 లక్షలకు ఈవీ వాహనాలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం కూడా ప్రజలను ఈవీలపై మొగ్గుచూపేలా చేసింది. అయితే ఈవీ వాహనాల పెరుగుదలకు తగ్గట్టుగా చార్జింగ్ స్టేషన్లు లేకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.