నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 29: మక్క రైతులు మరోసారి కన్నెర్ర చేశారు. కొనుగోలులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగం శశిధర్‌రెడ్డి మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. మూడు వారాలుగా జరుగుతున్న అన్యాయాన్ని పలువురు రైతులు మాజీ ఎమ్మెల్యే మర్రికి వివరిస్తూ కంటతడి పెట్టారు. గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించకుండా తమనే కాపలా పెడుతున్నారని, బస్తాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. రైతు సమస్యలను విని చలించిన మర్రి వారితో కలిసి సమీపంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో మక్కలను కొనుగోలు చేయడంలేదని, దీంతో వర్షానికి తడిచి ముద్దయిందని, తడిచిన ధాన్యం సైతం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించారు. గంటసేపు ఆందోళన కొనసాగడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి.
కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత
ధర్నా చేస్తున్న చోటుకు కలెక్టర్ రాకపోవడంతో రైతులు, బీఆర్ఎస్ నాయకులు మక్కల లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌తో కలెక్టర్‌కు ర్యాలీగా చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే మర్రి, నాయకులు, రైతులను డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ‘మా బాధలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్దామనుకుంటే అడ్డుకుంటారా?’ అంటూ గేటును తోసుకుంటూ లోపలికి వెళ్లారు. మర్రి జనార్దన్‌రెడ్డితోపాటు పలువురు లోపలికి వెళ్లి మూడు వారాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్‌కు వివరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మూడ్రోజుల్లో మార్కెట్లో ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేలా చూస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు.