అలంపూర్, డిసెంబర్ 24 : ఆశించిన దిగుబడి రాక.. చేతికొచ్చిన కొద్ది పంటనైనా మద్దతు ధరకు అమ్ముకుందామని వచ్చిన ఓ మక్క రైతు కొనుగోలు కేంద్రం వద్దే కుప్పకూలాడు. మూడు రోజుల క్రితం మక్కలు తెచ్చినా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో కాంటా వేయకపోవడంతో చలికి వణుకుతూ మక్క కుప్పల వద్దే పడిగాపులు కాసిన ఆ రైతు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం కలుకుంట్లలో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లి మండలం బొంకూరుకు చెందిన రైతు జమ్మన్న(64)కు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో ఎకరానికి పైగా మక్క వేసి, మిగతా పొలంలో పత్తి సాగుచేశాడు. అయితే మక్కలు దిగుబడి రాకపోవడంతో అమ్ముకునేందుకు సమీప గ్రామమైన కలుకుంట్లలో రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి మూడ్రోజుల కిందట 64 బస్తాలను తీసుకెళ్లాడు.
అయితే కొనుగోలు చేయకపోవడంతో చలికి మక్క కుప్ప వద్దే పడిగాపులు కాశాడు. మంగళవారం కాంటా వేసినప్పటికీ మరుసటి రోజు వచ్చి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని అక్కడి సిబ్బంది సూచించారు. దీంతో బుధవారం ఉదయం కలుకుంట్లకు వెళ్లి రైతువేదిక వద్ద బయట కూర్చున్న జమ్మన్న మధ్యాహ్నం ఒక్కసారిగా గుండెపోటుతో కిందపడిపోయాడు. తోటి రైతులు వెంటనే ప్రథమ చికిత్స చేసేందుకు యత్నించినా అప్పటికే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కాగా పంటలు సాగు చేసేందుకు ప్రైవేట్‌గా కొంత అప్పులు చేసినట్టు సమాచారం.