హైదరాబాద్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ): వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో చట్ట సవరణలకు ప్రతిపాదించి, వక్ఫ్ బోర్డుపై దుష్ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి మహమూద్ అలీ అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులతో కలిసి మహమూద్ అలీ మాట్లాడారు. 1995 వక్ఫ్ యాక్ట్‌లో 44 సవరణలను కేంద్రం ప్రతిపాదించిందని, సవరణలు దుర్మార్గమైనవని తెలిపారు. పదేండ్లలో కూడా వక్ఫ్ బోర్డుకు అన్యాయం చేయాలని చూశారని, కానీ వారి ప్రయత్నాలను కేసీఆర్ సాగనివ్వలేదన్నారు.
వక్ఫ్ బోర్డుకు అన్యాయం చేయడానికే కేంద్రం సవరణ బిల్లును తీసుకువస్తున్నదని, అందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించారని తెలిపారు. సవరణలను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని, కేసీఆర్ సైతం జేపీసీకి లేఖ రాశారని గుర్తుచేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ముస్లిములకు తీవ్రనష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ సలీం, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసియుల్లాఖాన్, జమీల్, మునీర్, బాసిత్ పాల్గొన్నారు.