బడంగ్‌పేట, నవంబర్ 10: రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నదని సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, ఐఏఎస్ పీఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఆదివారం మహేశ్వరం నియోజకవర్గ మాలల అత్మీయ సమ్మేళనం రాజేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి ఒక వర్గాన్ని తొలగించేందుకు కుట్ర జరుగుతున్నదని పేర్కొన్నారు. వర్గీకరణతో మాలలకే కాదు.. మాదిగలకూ ప్రమాదం పొంచి ఉన్నదని స్పష్టంచేశారు. మాల, మాదిగలను రాజకీయాలకు దూరం చేసేందుకు కేంద్రం లో నరేంద్రమోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నట్టు ఆరోపణలు చేశారు. మాలలు నిర్మాణాత్మక పోరాటాలు చేయాలని సూచించారు. రిజర్వేషన్లు ఎత్తివేయడమే కాకుండా రాజ్యాంగాన్ని ఎత్తివేయాలనే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణపై పలువురు వక్తలు ప్రసంగించారు. వర్గీకరణ అంశాన్ని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో మాలల ఐఖ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేర బాలకిషన్, గోకోజు రమేశ్, రాజు వస్తాద్, గాలి వినోద్ కుమార్, కార్పొరేటర్ గజ్జెల రాంచందర్, సత్యనారాయణ, బత్తుల రాంప్రసాద్, గద్ద శ్రీను తదితరులు పాల్గొన్నారు.