హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధిష్ఠానం డిసెంబర్ నాటికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని పదవి నుంచి తప్పించడం ఖాయమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం ఏలేటి మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్ టీమ్ సభ్యురాలు మీనాక్షికి తెలంగాణ ఇన్చార్జిగా నియమిస్తూ అప్పగించిన టాస్క్ కూడా ఇదేనని చెప్పారు. డిసెంబర్ నాటికి ‘మిషన్ సీఎం చేంజ్’ టాస్క్‌కు గ్రౌండ్ ప్రిపేర్ చేయడమే లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ పని చేస్తున్నారని చెప్పారు. తన కుర్చీ లాగేసేందుకు మంత్రులే యత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు? డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సీఎం కుర్చీపై కన్నేశారని చెప్పారు. కాంగ్రెస్ సరార్, క్యాబినెట్ పూర్తిగా గాడితప్పాయని విమర్శించారు. ఎవరి రాజ్యం వారిదే అన్నట్టుగా సీఎం, మంత్రుల మధ్య గ్యాప్ ఏర్పడిందని తెలిపారు. ఒక మంత్రీ తనను లెక చేయట్లేదని సీఎం రేవంతే గాంధీభవన్‌లో మీనాక్షి నటరాజన్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మాత్రమే అధిష్ఠానం పెద్దలకు కప్పం కట్టేవారని, ఇప్పుడు సీఎం పదవి పోటీలో ఉన్న మంత్రులు కూడా కప్పం కడుతున్నారని ఏలేటి ఆరోపించారు. రాష్ట్రంలో, దేశంలో మునుపెన్నడూ జరగని కుంభకోణాలతో అక్రమంగా సంపాదిస్తూ ఢిల్లీకి అత్యధిక కప్పం మంత్రి పొంగులేటి కడుతున్నారని అన్నారు. ఇప్పటివరకు ‘ఆర్, యూ, బీ’ ట్యాక్స్‌లు ఉండగా కొత్తగా ‘పీ’ ట్యాక్స్ కూడా జత కలిసిందని చెప్పారు. ‘బీ’ ట్యాక్స్ 15 శాతం, ‘పీ’ ట్యాక్స్ 50 శాతం నడుస్తున్నదని ఆరోపించారు. ఎవరికి వారు సీఎంకు రావాల్సిన ట్యాక్స్‌కు గండి పెడుతుంటే రేవంత్‌రెడ్డి నేరుగా ఢిల్లీ వెళ్లి ఎంత కప్పం కట్టాలో చెప్పండి కట్టేస్తాను అని అధిష్ఠానం పెద్దలతో చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నదని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఇది మామూలు ప్రభుత్వం కాదని, ట్యాక్స్‌ల సర్కారు అని ఎద్దేవా చేశారు.
బీసీలకు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టుబడుతున్నారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఎస్సీలు కూడా మరోమంత్రి పదవి కావాలని అడిగితే భట్టివిక్రమార్క అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాను ఒకడినే పదవిలో ఉండాలని కోరుకుంటున్నారని విమర్శించారు. మరొకరు పదవిలో ఉంటే తన ప్రాధాన్యత తగ్గిపోతుందని భావిస్తున్నట్టు అభిప్రాయం వ్యక్తంచేశారు. సీఎం సీటును టార్గెట్ పెట్టుకున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం ఎందుకు కమిటీ వేయడంలేదని ప్రశ్నించారు. గతంలో సీఎం ఎకడ ఉంటే పొంగులేటి అక్కడ ఉండేవారని, ఇప్పుడు ఎకడా కనిపించడంలేదని చెప్పారు. అందుకే మంత్రి శ్రీధర్‌బాబును రేవంత్ వెంటపెట్టుకుని తిరుగుతున్నారని తెలిపారు.