సిరిసిల్ల రూరల్, జూన్ 15: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండతో హైదరాబాద్‌లోని దవాఖానలో చికిత్సపొంది కోలుకున్న మంద మహేశ్ ఆదివారం ఇంటికి చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మంద మహేశ్ ఉపాధికోసం నిరుడు సౌదీ వెళ్లాడు. మే నెలలో సౌదీలో మహేశ్ ప్రయాణిస్తున్న కారును ఓ వాహనం ఢీకొట్టింది. వాహనంలోని 8 మంది అక్కడికక్కడే మృతిచెందగా, మహేశ్ నడుము, కాళ్లు విరిగి అచేతన స్థితిలో సౌదీలోని దవాఖానలో చేరాడు. సెల్ఫీ వీడియో ద్వారా తన దయనీయస్థితిని వివరిస్తూ కేటీఆర్‌ను వేడుకోగా ఆయన స్పందించి ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి, స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాటు చేశారు.
మే 11న మండెపల్లిలో మహేశ్ కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని చెప్పారు. నాలుగు రోజుల్లో స్వదేశానికి రప్పించి హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచే నేరుగా కిమ్స్ దవాఖానకు తరలించారు. కేటీఆర్ కిమ్స్ వైద్యులు మహేశ్ ఎడమకాలుకు శస్త్ర చికిత్సతోపాటు ఇతర క్రిటికల్ సేవలను 20 రోజులపాటు అందించారు. దవాఖాన బిల్లు రూ.9 లక్షలు కేటీఆర్ చెల్లించడంతో రెండురోజుల క్రితం డిశ్చార్జయి ఇంటికి చేరాడు. తనకు అండగా నిలిచిన కేటీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని మహేశ్, కుటుంబసభ్యులు తెలిపారు. మహేశ్‌కు భార్య లక్ష్మితోపాటు కూతురు నిత్యశ్రీ, కొడుకు హర్షవర్ధన్ ఉన్నారు.