హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఢిల్లీలో అధిష్ఠానం సీరియస్ క్లాస్ పీకినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో జో రుగా చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో పార్టీలో, ప్రభుత్వంలో పూర్తిగా క్రమశిక్షణ అదుపుతప్పిందని తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసినట్టు సమాచారం. సోమవారం ఢిల్లీ వెళ్లిన మహేశ్‌కుమార్‌గౌడ్.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్‌పై ఖర్గే తీవ్ర మండిపడ్డట్టు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా మంత్రుల మధ్య వరసు గొడవలపై ఖర్గే ఆరా తీసినట్టుగా తెలిసింది. పదేపదే మంత్రుల మధ్య తగాదాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించినట్టు తెలిసింది. ఇన్నిసార్లు గొడవలు జరుగుతున్నా.. ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా ఏం చేస్తున్నారని, ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసినట్టు తెలిసింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్కపై కూడా ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మంత్రులుగా ఉంటూ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఎలా? అని ఆగ్రహించినట్టు తెలిసింది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై అధిష్టానానికి సమాచారం ఎందుకు ఇవ్వడంలేదని మహేశ్‌కుమార్‌ను ఖర్గే నిలదీసినట్టుగా తెలిసింది. ‘పీసీసీ అధ్యక్షుడిగా పార్టీకి ప్రతినిధివి అనే విషయం మర్చిపోయావా?.. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నుంచి మాకు స మాచారం అందిన తర్వాత కూడా పీసీసీ నుంచి సమాచారం ఎందుకు రావడం లేదు?’ అని ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలపై పార్టీ అజమాయిషీ ఏమైనా ఉందా? అని ప్రశ్నించినట్టు సమాచారం. ప్రభుత్వానికి ప్రతినిధిగా కా కుండా పార్టీకి ప్రతినిధిగా వ్యవహరించాలని పీసీసీ చీఫ్‌కు ఘాటుగానే చెప్పినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ గందరగోళంగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.