హైదరాబాద్ : తెలంగాణ అమరుల త్యాగాలు, ఉద్యమ జ్ఞాపకాలు, పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ‘దీక్షా దివస్’ను నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై కో–ఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయాన్ని మహేశ్ బిగాల స్మరించారు. ఆ రోజు ప్రారంభమైన దీక్షే తెలంగాణ ఉద్యమానికి మలుపు తిప్పిందని, ప్రజల ఆకాంక్షలకు దిశానిర్దేశం చేసిన మహత్తర ఘట్టమని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ చేపట్టిన దీక్షకు అప్పుడు అన్ని వర్గాల తెలంగాణ ప్రజలు అండగా నిలవడంతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, చివరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని మహేశ్ బిగాల గుర్తుచేశారు. ఈ చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రపంచ దేశాలన్నింటిలోనూ బీఆర్ఎస్ ఎన్నారై విభాగం సమన్వయంతో దీక్షా దివాస్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.