రామగిరి, జనవరి 28 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన సందర్భంగా నల్లగొండ శివారులోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) వద్ద పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. రైతు మహాధర్నా కోసం మంగళవారం ఉదయం నల్లగొండ పట్టణానికి వస్తున్న కేటీఆర్‌ను వర్సిటీ ఎదుట ఉన్న నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై ఎంజీయూ వద్ద పలువురు విద్యార్థులు ఆపి తమ సమస్యలు వివరించారు. యూనివర్సిటీలో సమస్యలు పేరుకుపోయాయని, గొడ్డుకారంతో అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశా రు. దీంతో తిరుగు ప్రయాణంలో వర్సిటీకి వస్తానని కేటీఆర్ భరోసా ఇ చ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే వర్సిటీ లోపలికి ఎవరినీ వెళ్లనివ్వకుండా భారీగా మోహరించారు. మెయిన్ గేట్ మూసేసి తాళం వేశారు. లోపలికి వెళ్లేవారిని వివరాలు తెలుసుకుని అనుమతించారు.
మరోవైపు, విద్యార్థులు ఎవరూ బయటకు వెళ్లొద్దంటూ వర్సిటీ అధికారులు హుకుం జారీచేశారని బయట ఉన్న కొందరు విద్యార్థులు వాపోయారు. వర్సిటీ లోపల సైతం పోలీసులు మోహరించారు. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత బీఆర్ఎస్ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్ ఎంజీయూకు చేరుకొని ఓఎస్డీ ప్రొఫెసర్ కొప్పుల అంజిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. గేటు తా ళం తీయాలని, లేనిపక్షంలో లోపలికి దూసుకొని రావాల్సి వస్తుందని హెచ్చరించడంతో కొంతమంది విద్యార్థులు బయటకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కూడా చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. ఇంతలో కేటీఆ ర్, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వర్సిటీ వద్ద్దకు చేరకున్నారు. కేటీఆర్‌ను కలిసిన విద్యార్థులు సమస్యలు ఏకరువు పెట్టా రు. ‘పర్మిషన్ ఇస్తే లోపలికి వస్తా.. నేను వస్తే మీ మీద కేసులు పెడుతరు..’ అని కేటీఆర్ అనగానే.. సీఎం.. సీఎం అం టూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పరీక్ష ఫీజులు, బాలికలకు నూతన హాస్టల్ భవనాలు, నాణ్యమైన భోజనం, సెల్ఫ్‌ఫైనాన్స్ కోర్సులో అధ్యాపకుల నియామకం తదితర సమస్యలపై కేటీఆర్‌కు వివరించగా వీసీతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు.