హైదరాబాద్/నిజామాబాద్/మంచిర్యాల, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధులు): మహారాష్ట్రలో ‘చేతి’ పార్టీ తేలిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతల మాటలకు విలువలేకుండా పోయింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఘోర ఓటమిలో తెలంగాణ కాంగ్రెస్ నేతల పాత్ర తోడైంది. తెలంగాణలో కాంగ్రస్ పాలకులు హామీల అమలులో మొండి‘చేయి’ చూపించడంతో.. మహారాష్ట్ర ప్రజలు కూడా హస్తం పార్టీకి రిక్తహస్తం చూపించారు. తెలంగాణకు పశ్చిమ దిక్కున మహారాష్ట్రలో ఉన్న నాందేడ్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ హస్తం పార్టీ ఖాతా తెరవనేలేదు. ఈ లోక్‌సభ పరిధిలోని నాయ్‌గావ్, దెగ్లూర్, ముద్ఖేడ్, భోకర్‌లో తెలంగాణ వాసులు ఎక్కువగా జీవనం సాగిస్తున్నారు. నాందేడ్ నగరంలోనే సుమారు 40 వేల మంది వరకు తెలుగు మాట్లాడే వారున్నారు. ఇక్కడ రాహుల్‌గాంధీతోపాటు తెలంగాణ మంత్రులు, ఎంపీలు ప్రచారం చేశారు. నాందేడ్ లోక్‌సభకు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్‌ను ఇన్చార్జిగా నియమించారు. తెలంగాణలో రేవంత్ సర్కారు వైఫల్యం మూలంగా ఆరు అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది.
తెలంగాణలో కాంగ్రెస్ అబద్ధపు హామీలను పొరుగునే ఉన్న మరాఠీలు పసిగట్టారు. కేసీఆర్ హయాంలో ఉన్న పలు పథకాలు నేడు లేవనే విషయాన్ని వారు గుర్తించారు. ఆదిలాబాద్ సమీపంలోని అర్ని, కిన్వట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారు. నిర్మల్ జిల్లా పక్కనున్న బోకర్, నయాగాం నియోజకవర్గాల్లో సైతం కాంగ్రెస్‌కు ఓటమి తప్పలేదు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలతో కలిసి సరిహద్దు పంచుకుంటున్న అహేరి నియోజకవర్గంలో కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితమైంది. ఆసిఫాబాద్ పక్కనున్న చంద్రాపూర్ నియోజకవర్గంలోనూ హస్తం పార్టీకి ఓటమి తప్పలేదు. ఆయా నియోజకవర్గాల్లో సీఎం రేవంత్ సహా మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచారం అక్కడి హస్తం పార్టీ అభ్యర్థుల కొంపముంచింది.
సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ మం త్రుల మాటలు నమ్మి ఓటేయొద్దు.. అని మహారాష్ట్ర ఓటర్లకు బంధువులు, మిత్రులైన తెలుగు ప్రజల సూచన ఫలించింది. తెలంగాణలో 11 నెలల కాలంలోనే ఆరు గ్యారెంటీలు, హామీలను అమలు చేయకుండా మాయమాటలతో మోసం చేయజూసిన విషయాన్ని తేల్చిచెప్పడంతో మహారాష్ట్ర ప్రజలు జాగ్రత్తపడ్డారు. దీంతో సరిహద్దు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చతికిలపడింది. రేవంత్ మాటల మీద అనుమానం వచ్చిన మహారాష్ట్ర తెలుగు ప్రజలు బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నదో ఆరా తీశారు.
కాంగ్రెస్‌ను మా రాష్ట్ర రైతు లు నమ్మలేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇస్తానని చెప్పిన పథకాలను అమలు చేయలేదు. దీంతో కిన్వట్ నియోజకవర్గ రైతులు కాంగ్రెస్‌ను పక్కనబెట్టారు. తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు రైతుల కోసం అమలుచేసిన పథకాలు ఇప్పుడు లేవని అక్కడ ఉన్న మా బంధువులు చెప్పడంతో అందరం కాంగ్రెస్‌ను దూరం పెట్టినం.
– పెందూర్ లచ్చు, రైతు, హీరాపూర్, కిన్వట్ నియోజకవర్గం
మహారాష్ట్ర ఎన్నికల్లో మరట్వాడ, విదర్భతోపాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ నాయకుల హామీలను నమ్మలేదు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో అమలు చేస్తున్న పథకాలను మహారాష్ట్రలో సైతం అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సభల్లో ప్రకటించారు. వారి పథకాలపై నమ్మకం లేకపోవడంతో కాంగ్రెస్‌ను మరాఠా ప్రజలు నమ్మలేదు.
– నితిన్ యాదవ్, సర్పంచ్, సగ్దా, అర్ని నియోజకవర్గం