హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై దేశవ్యాప్తంగా సానుకూల స్పందన వస్తున్నది. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మహారాష్ట్రలోనూ తిరుగులేని ఆదరణ లభిస్తున్నది. తెలంగాణ మాడల్ పథకాలు దేశమంతటా వస్తాయనే ఆకాంక్ష మరాఠ్వాడ ప్రజల్లో వ్యక్తమవుతున్నది. వచ్చే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్టు వారి మాటల్లో తెలుస్తున్నది. వంద శాతం మంచి పనులు, ఎన్నో సం క్షేమ పథకాలు తెచ్చి తెలంగాణను సుభిక్షంగా చేసిన కేసీఆర్ నాయకత్వం తమకూ కావాలని మహారాష్ట్రవాసులు ముక్తకంఠంతో తెలిపారు. అన్ని వర్గాల కష్టాలు తెలిసిన కేసీఆర్ లాంటి నేత దేశ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామంగా తెలిపారు. వర్గాలకు, ప్రాంతాలకు, పార్టీలకతీతంగా కేసీఆర్ నాయకత్వాన్ని జాతీ య స్థాయిలో కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ‘కేసీఆర్ పార్టీ తరఫున మా రాష్ట్రంలోని పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మహారాష్ట్రలోని మా నాయకులకంటే వందశాతం మంచోడు కేసీఆర్. ఎన్నో మంచి పథకాలతో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నా రు. ఇది నేనొక్కడిని అంటున్న మాట కాదు. కొందరు పార్టీ నాయకులు సైతం కేసీఆర్ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేయాలని అంటున్నారు’ అని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని పలాజ్ గ్రామానికి చెందిన సురేశ్ సబ్బిడివార్ ‘నమస్తే తెలంగాణ’ బృందానికి చెప్పారు.
కేసీఆర్ సారథ్యంలో పనిచేసేందుకు సిద్ధం
కేసీఆర్ సారథ్యంలో పనిచేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నట్టు మహారాష్ట్రవాసులు చెప్పారు. ‘కేసీఆర్ జాతీయ పార్టీకి మా పూర్తి మద్దతు ఉంటుందని ఇప్పటికే ఆయనకు లెటర్ పంపినం. రెండు నెలల్లో మహారాష్ట్రలో మా ప్రాంతంలో మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఇక్కడి నాయకులు సిద్ధంగా ఉన్నారు’ అని బన్నెలి గ్రామవాసి లక్ష్మణ్ నిదాన్కర్ అన్నారు. ‘కేసీఆర్ మా ప్రాంతాన్ని సందర్శించాలి’ అని కాంక్షించారు ధర్మాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త శంకర్ పాటిల్. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తమకూ రావాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని, అప్పుడే దేశంలో రైతుల బతుకులు బాగుపడతాయని.. తెలంగాణ పథకాలు దేశమంతటా వస్తాయని అన్నారు నాందేడ్ జిల్లా కిన్వట్ తాలూకాలోని అప్పారావుపేట గ్రామానికి చెందిన రైతు పిట్ల నారాయణ. తెలంగాణ తరహా పథకాలు కేసీఆర్‌తోనే సాధ్యమని బిలోలి గ్రామానికి చెందిన జయరాం కుడికే తెలిపారు. తెలంగాణలో ఉన్న ఎన్నో గొప్ప పథకాలు దేశమంతటా అమలు కావాలంటే కేసీఆర్‌తోనే సాధ్యమవుతుందన్నారు.
రైతులంతా కేసీఆర్‌కు మద్దతుగా నిలుస్తారు
‘తెలంగాణలో సీఎం కేసీఆర్ తెచ్చిన రైతుబీమా, రైతుబంధు పథకాలు యావత్ దేశంలోని రైతుల్లో భరోసా నింపాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలోని రైతులంతా కేసీఆర్‌కు మద్దతుగా నిలుస్తారు’ అని పర్భానీ జిల్లాలోని బోరి గ్రామానికి చెందిన రైతు లింగయ్య చెప్పారు. ‘ఇప్పుడున్న పార్టీవాళ్లు ఎన్నేండ్లు ఉన్నా మా బతుకులు మారవని అర్థమైంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే చెప్పకున్నా అన్ని పనులు చేస్తాడన్న నమ్మకముంది’ అని సింగర్వాడీకి చెందిన రైతు రాజుగార్లే తెలిపారు. దేశానికి ప్రత్యామ్నాయనేత కేసీఆర్ అని నాందేడ్ జిల్లా ఆలూరు గ్రామ మాజీ సర్పంచ్ బాబురావ్ మారుతి పటేల్ పేర్కొన్నారు. దక్షిణాది నుంచి కేసీఆర్ దేశ్ కా నేతగా ఎదగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ‘గరీబోళ్లకు కేసీఆర్ మంచి సౌలత్ చేస్తుండు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే పేదలందరికీ మేలు జరుగుతుంది’ అని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకా ధర్మపురికి చెందిన సమ్మయ్య ఇడుగురాల తెలిపారు.
కేసీఆర్ గొప్ప నాయకుడు
కేసీఆర్ లాంటి ఆదర్శ నాయకుడు దేశ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామం. మా బంధువులంతా మా బార్డర్‌లోని తెలంగాణలో ఉన్నారు. అక్కడ రైతు బంధు, రైతు బీమా, రైతులకు ఉచిత 24 గంటల కరంటు, ఆడపిల్ల పెండ్లికి లక్ష, వృద్ధులకు, బీడీ కార్మికులకు, వికలాంగులకు పింఛన్లు ఇవన్నీ వింటే మేమెందుకు తెలంగాణలో పుట్టలేదో అనిపిస్తది. కేసీఆర్ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేసి ఈ పథకాలు ప్రకటిస్తే మాత్రం ఆయనకు తిరుగులేదు.
– రాములు సల్లావాడ్, దివిశి(బీకే)
కేసీఆర్ పార్టీ పెట్టడం మంచిదే
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం మాకు ఇష్టమే. కేసీఆర్‌కు మేమంతా సపోర్ట్ చేస్తాం. కేసీఆర్ తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్నడు. రైతుబంధు, రైతుబీమా అందజేస్తున్నడు. అసొంటి నేత దేశాన్ని పాలిస్తే మంచిదే కదా.. జాతీయ పార్టీ బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నాం.
– తోకల సమ్మయ్య,
ఆటో డ్రైవర్, సిరొంచ, గడ్చిరోలి జిల్లా