Telangana Ministers | హైదరాబాద్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): ‘పని పాతర పెట్టి ఊరు జాతర పోయిందనే’ సామెత చందంగా రాష్ట్రంలో పాలనకు పాతరేసిన తెలంగాణ మంత్రులు.. ఇతర రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీతక్క తదితరులు మహారాష్ట్ర, ఝార్ఖండ్, కేరళ రాష్ర్టాలకు క్యూ కడుతున్నారు. అక్కడి ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.
మరో ఇద్దరు మంత్రులు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు లండన్, స్కాట్లాండ్ పర్యటనలో ఉండగా, మరో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మలేషియా పర్యటనలో ఉన్నారు. ఇతర రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో, విదేశీ పర్యటనల్లో తలమునకలైన మంత్రులు సొంత రాష్ట్రంలో ధాన్యం, పత్తి కొనుగోళ్లు లేక రైతులు పడుతున్న గోసను మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి.
త్వరలో మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానానికి రాహుల్‌గాంధీ రాజీనామాతో ఉప ఎన్నికలొచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకగాంధీ పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవి కావడంతో విజయం కోసం నానా తం టాలు పడుతున్నారు.
రాష్ట్రంలో ధాన్యం, పత్తి కోతలు మొదలై నెల గడుస్తున్నా, వాటిని కొనుగోలు చేసే దిక్కులేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల పే రుతో తిరస్కరిస్తుంటే దిక్కులేక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. రైతులు ఇక్కడ నానా గోస పడుతుంటే, తెలంగాణ మంత్రులు మాత్రం ఇతర రాష్ర్టాల్లో గొప్ప లు చెప్తున్నారనే విమర్శలొస్తున్నాయి. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డినే ఈ విధంగా ప్రచారం చే స్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.