హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదం దేశంలో ప్రభంజనం సృష్టిస్తున్నది. దశాబ్దాలుగా కల్లబొల్లి కబుర్లతో కాలం వెల్లదీసి, రైతాంగ సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరించిన ప్రభుత్వాల పాలకులను హడలెత్తిస్తున్నది. రైతాంగం మెప్పు పొందే దిశగా పరుగులు పెట్టిస్తున్నది.
తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్ ఇందుకు నిదర్శనం. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని ఇప్పటికే కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలు కాపీ కొట్టగా, తాజాగా ఆ జాబితాలో మహారాష్ట్ర సర్కారు చేరింది. ఆ రాష్ట్రంలోని 1.5 కోట్ల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.6 వేలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్లో 6,900 కోట్లను కేటాయించింది. బీఆర్ఎస్కి మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణ వల్లే ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మహారాష్ట్ర బడ్జెట్‌పై బీఆర్ఎస్ ప్రభావం
స్వల్పకాలంలోనే బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణ చూసి మహారాష్ట్ర పాలకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి రైతాంగానికి ఉపశమనం కలిగించే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు అమలుకు నిర్ణయించారు. ఆత్మహత్యలు అత్యధికంగా నమోదవుతున్న మరాట్వాడ, పర్భణి పరిధిలోని 14 జిల్లాల్లోని రైతులకు సరఫరా చేస్తున్న గోధుమలకు బదు లు ఏటా ఒక్కో రైతుకు రూ.1,800 నేరుగా అందజేయనున్నారు. మిషన్ కాకతీయను స్ఫూర్తిగా తీసుకొని 2016లో ప్రారంభించి, అటకెక్కించిన జలయుక్త్ శివార్ పథకాన్ని పునఃప్రారంభించాలని నిర్ణయించారు. మహారాష్ట్ర రైతాంగంలో బీఆర్ఎస్కు లభిస్తున్న ఆదరణను చూసి అక్కడి నేతల్లో వణుకు పుట్టిందని పలువురు పేర్కొంటున్నారు.
కేసీఆర్ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’కు విశేష స్పందన
కరెంటు అందక, సాగునీరు లేక, మద్దతు ధర లేక, ప్రభుత్వ చేయూత లేక మహారాష్ట్ర రైతాంగం దశాబ్దాలుగా కునారిల్లుతున్నది. రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా మారింది. కాగా, తెలంగాణ పథకాలపై మహారాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుండటంతోపాటు తమకూ ఆ పథకాలు కావాలని డిమాండ్ చేస్తున్నది. అబ్ కిబార్ కిసాన్ సర్కార్ నినాదంతో నాందేడ్‌లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి ఈ నేపథ్యంలోనే విశేష స్పందన లభించింది.
తెలంగాణకు సరిహద్దులో ఉన్న నాందేడ్ జిల్లాతోపాటు సౌత్, నార్త్, బోకర్, నాయిగాం, ముద్కేడ్, డెగ్లూర్, లోహా నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, నయీగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్‌నగర్ తదితర మండలాల్లో తెలంగాణ పథకాలపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. నాందేడ్ సమావేశంతో బీఆర్ఎస్లో మొదలైన చేరికల పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే వున్నది. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ సభ్యులు, పంచాయితీ సమితి సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, కాంగ్రెస్, బీజేపీ, శివసేనకు చెందిన సీనియర్ నేతలు, కీలకనాయకులు బీఆర్ఎస్లోకి వరుసకడుతున్నారు.
తెలంగాణ పథకాలన్నీ కావాలి
పంట పెట్టుబడి సాయం ఒక్కటే కాదు తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలన్నీ కావాలని మహారాష్ట్ర రైతులు కోరుకుంటున్నారు. ఉచిత కరెంటు, సాగునీళ్లు, సకాలంలో ఎరువులను అందివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్రలో విశేష స్పందన లభిస్తున్నది. బీఆర్ఎస్లో చేరేందుకు రైతులు, యువకులు, నేతలు ఉత్సాహం చూపుతున్నారు. బీఆర్ఎస్ను చూసి ఇక్కడి పార్టీలన్నీ వణికిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభావం వల్లే బడ్జెట్లో రైతుల కోసం నిధులను పెంచారు.
– మాణిక్‌రావు కదం, భారత రాష్ట్ర కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు