హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో హిమాలయాలు లేకు న్నా తమది అంతకంటే ఎత్తయిన సంకల్ప బలమని, అందుకే ఏప్రిల్ నెలలో కూడా రాష్ట్ర నదులు, చెరువుల్లో నీళ్లు పారుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. చిత్తశుద్ధి, సాధించాలనే పట్టుదల, నిజాయితీ ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలంగాణలో నిరూపించామని చెప్పారు. తెలంగాణలో నేడు రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జీరో అయ్యాయని, ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లినవారు తిరిగి వచ్చారని తెలిపారు.
దేశంలోని వరిసాగులో సగంకన్నా ఎక్కువ తెలంగాణలోనే ఉన్నదని పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు నేతలు, వివిధ పార్టీలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి సీఎం గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, తన 50 ఏండ్ల రాజకీయ జీవితంలో అనేక కష్టనష్టాలు, ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నానని.. నేడు రైతుల కష్టాలను తలకెత్తుకొన్నాని చెప్పారు.
Cmkcr1
పుష్కలమైన వనరులున్నా మనం ప్రపంచంతో పోటీ పడలేకపోవటానికి గత పాలకుల విధానలోపాలే కారణం. సింగపూర్‌తో పోల్చుకుంటే మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది.
– సీఎం కేసీఆర్
రైతులది న్యాయమైన పోరాటం
దేశంలో రైతులు నేడు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఉద్యమం పూర్తిగా న్యాయసమ్మతమైనదని అన్నారు. ‘పోరాడే శక్తి, మనసులో నిజాయితీ ఉంటే ఏదైనా సాధించవచ్చు. విజయం సాధించేందుకు కొంత సమయం పట్టొచ్చు. ప్రతి సమస్యకూ తప్పనిసరిగా ఒక పరిష్కారం ఉంటుంది. అయితే సమస్యకు పరిష్కారమార్గం ఎంత త్వరగా కనుగొంటామనేది మన తెలివిపై ఆధారపడి ఉంటుంది. పరిష్కారం త్వరగా కనుగొన్నచోట ఎంతో అభివృద్ధిని మనం చూశాం. రైతుల సమస్యలపై పోరాటం నేటిది కాదు.
బ్రిటిష్ పాలనాకాలంలో 1935 నుంచే ప్రారంభమైంది. పంజాబ్‌కు చెందిన సర్ చోటూరాం రైతు సమస్యలపై పోరాటానికి ఆద్యుడు. మహేందర్‌సింగ్ టికాయత్, మహారాష్ట్రలో శరద్ జోషీ, బెంగళూరులో ప్రొఫెసర్ నంజుండస్వామి, తమిళనాడులో నారాయణస్వామి, పంజాబ్‌లో రాజోవార్, హర్యానాలో గుర్నామ్‌సింగ్ తదితరులు రైతులకోసం పోరాడిన నేతలే. చౌదరి చరణ్‌సింగ్, దేవీలాల్ వంటి నాయకులు కూడా రైతుల అభ్యున్నతికి ఎంతగానో కృషిచేశారు. ఎంతో కొంత ఫలితాలు కూడా సాధించారు. రైతులు నేటికీ పోరాడుతూనే ఉన్నారు’ అని వివరించారు.
దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో విమానం దిగాలన్నా కనీసం అరగంట గాలిలో ఎగరాల్సి ఉంటుంది. విమానం దిగడానికి కూడా స్థలం దొరకడంలేదు. ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న 14వ ప్రధానమంత్రికిగానీ, ఇప్పటివరకు పనిచేసిన వ్యవసాయ మంత్రులకుగానీ కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే రైతుల పరిస్థితి ఇలా ఉండేది కాదు.
– సీఎం కేసీఆర్
రైతుల మరణాలపై సానుభూతి లేని ప్రధాని
రైతుల పట్ల, వారి సమస్యల పట్ల ప్రధాని నరేంద్రమోదీకి కనీస సానుభూతి లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. వేల మంది రైతులు ఇటీవలే ఢిల్లీలో 13 నెలలు ఆందోళన చేశారు. వారిని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లు, ఖలిస్థానీలు, ఉగ్రవాదులుగా ముద్రవేసింది. అయినా వాళ్లు ఎండనీ, వర్షాన్నీ, చలినీ లెక్కచేయకుండా పోరాడటంతో చివరికి ప్రభుత్వం తలవంచక తప్పలేదు. సాక్షాత్తూ ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పి నల్ల చట్టాలు వెనక్కు తీసుకోవడంతో మనం సంబరపడిపోయాం.
కానీ, ఈ రైతుల ఆందోళన సందర్భంగా 750 మంది రైతులు చనిపోయినా వారి కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు ప్రధాని నోటి వెంట ఒక్క పదం రాలేదు. వారికి ఎటువంటి సహాయం అందలేదు. ఏ సమస్యా పరిష్కారం కాలేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే ప్రధాని క్షమాపణ చెప్పేవారు కాదు. ఆ చట్టాలను వెనక్కు తీసుకొనేవారు కాదు. మనం పోరాడినప్పుడల్లా నిప్పుపై నీళ్లు చల్లినట్టు ఏదో ఒక చిన్న హామీతో ఉద్యమాన్ని చల్లార్చి మనల్ని బేవకూఫ్‌లు చేస్తున్నారు. ఇప్పుడు మనం మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది’ అని పిలుపునిచ్చారు.
Cmkcr3
రైతుల బాధలు చూసి అనేకసార్లు ఏడ్చాను
దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ రైతులు గతంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ‘మహారాష్ట్రకన్నా ఎన్నోరెట్లు అధ్వాన్న పరిస్థితి ఇక్కడ ఉండేది. రోజూ నలుగురు-ఐదుగురు రైతులు, ఆరేడు మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొనేవారు. వార్తా పత్రికల్లో వారంలో నాలుగైదు రోజులు ఆత్మహత్యల వార్తలే ప్రముఖంగా ఉండేవి. రైతు ఆత్మహత్యలు చూసి నా కండ్లల్లో నీళ్లు తిరిగేవి. తెలంగాణ ఉద్యమం సందర్భంగా ప్రజలు, రైతుల బాధలు చూసి అనేక సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకొన్నా. అయినా, మొక్కవోని దీక్షతో పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక చాలా ఉపశమనం కలిగింది. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిచేశాం. ఇంకా చాలా పనులు పురోగతిలో ఉన్నాయి.
తెలంగాణలో వరి సాగు విప్లవం
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం నేడు భారత్‌లో 94 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, అందులో 56 లక్షల ఎకరాలు తెలంగాణలోనే ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘దేశం మొత్తంలో సాగవుతున్న వరికన్నా తెలంగాణలో సాగవుతున్నదే ఎక్కువ అని చెప్పేందుకు గర్వంగా ఉన్నది. ఏప్రిల్ మండుటెండల్లో సైతం తెలంగాణలో నదులు ప్రవహిస్తున్నాయి. చెరువుల్లో నీరు పుష్కలంగా ఉన్నది. ఇక్కడ హిమాలయాలు లేకున్నా అంతకన్నా ఎత్తయిన సంకల్పం ఉన్నది. అదే నేడు నదుల్లో నీరు ప్రవహించేలా చేస్తున్నది. ఇటువంటి అభివృద్ధి దేశమంతా సాధ్యం చేసేందుకు వీలున్నది’ అని కేసీఆర్ స్పష్టంచేశారు.
ఢిల్లీలో రైతులు తమ హక్కుల కోసం 13 నెలలు ఆందోళన చేస్తే వారిపై కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లు, ఖలిస్థానీలు, ఉగ్రవాదులుగా ముద్రవేసింది. అయినా వాళ్లు ఎండనీ, వర్షాన్నీ, చలినీ లెక్కచేయకుండా పోరాడటంతో చివరికి ప్రభుత్వం తలవంచక తప్పలేదు. సాక్షాత్తూ ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పి నల్ల చట్టాలు వెనక్కు తీసుకోవడంతో మనం సంబరపడిపోయాం. కానీ, ఈ రైతుల ఆందోళన సందర్భంగా 750 మంది రైతులు చనిపోయినా వారి కుటుంబాలకు సానుభూతి తెలిపేందుకు ప్రధాని నోటి వెంట ఒక్క పదం రాలేదు. వారికి ఎటువంటి సహాయం అందలేదు. ఏ సమస్యా పరిష్కారం కాలేదు. ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు లేకపోతే ప్రధాని క్షమాపణ చెప్పేవారు కాదు.
– సీఎం కేసీఆర్
ప్రపంచంతో ఎప్పుడు పోటీ పడగలం?
పుష్కలమైన వనరులున్నా మనం ప్రపంచంతో పోటీ పడలేకపోవటానికి గత పాలకుల విధానలోపాలే కారణమని సీఎం కేసీఆర్ విమర్శించారు. మనకు దేనికీ కొదవలేదు. ఏమీలేని సింగపూర్‌తో పోల్చుకుంటే మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. అక్కడి అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులతో మనదేశాన్ని పోల్చుకుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. అక్కడ మట్టి కూడా లేదు.
ఆ దేశ చుట్టుకొలత కేవలం 193 కిలోమీటర్లు. సముద్రతీరం కూడా193 కిలోమీటర్లే. భారతదేశ తీర రేఖ పొడవు 7,516 కిలోమీటర్లు. కానీ, దేశంలోని రైతులతోపాటు ఇతర రంగాల పరిస్థితి కూడా ఎంతో అధ్వాన్నంగా ఉన్నది. అంతర్జాతీయంగా ట్రక్కు స్పీడు సగటున గంటకు 85-115 కిలోమీటర్లు. మనదేశంలో 35-45 కిలోమీటర్లు. అంతర్జాతీయంగా గూడ్స్‌రైలు స్పీడు సగటున గంటకు 125-150 కిలోమీటర్లు. మన గూడ్సురైలు స్పీడు 55-60 కిలోమీటర్లు. ఇలాంటి పరిస్థితిలో మనం ప్రపంచంతో ఎప్పుడు పోటీపడగలం? 193 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న సింగపూర్ ఏటా 5500 కోట్ల కంటెయినర్లను హ్యాండిల్ చేస్తే, 7500 కిలోమీటర్ల తీర రేఖ ఉన్న భారత్ 35 లక్షల కంటెయినర్లను హ్యాండిల్ చేస్తున్నది’ అని అన్నారు.
గత పాలకులవల్లే ఈ పరిస్థితి
దేశంలో ఏ ఎయిర్‌పోర్టులో విమానం దిగాలన్నా కనీసం అరగంట గాలిలో ఎగరాల్సి ఉంటుందని, విమానం దిగడానికి కూడా స్థలం దొరకడంలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘మహారాష్ట్రలోని లోహా పర్యటనలో భాగంగా ఇటీవల నాందేడ్ వెళ్లాను. అక్కడ అధికారులు సాయంత్రం ఐదున్నరకల్లా తిరిగి వెళ్లిపోవాలని నాకు చెప్పారు. విమానాశ్రయం హోదాను తగ్గించడంవల్ల సమయాలు తగ్గించినట్టు, ఇప్పుడు ఆ ఎయిర్‌పోర్టు కేవలం పగలు మాత్రమే పనిచేస్తున్నదని చెప్పారు. దీన్నిబట్టి హిందుస్థాన్ ముందుకు పోతున్నదా? వెనక్కు పోతున్నదా? అర్థం చేసుకోవచ్చు. అన్ని రంగాల్లో పరిస్థితి ఇలాగే ఉన్నది. దీన్ని కచ్చితంగా చక్కదిద్దాలి. దీన్ని బాగుచేసే శక్తి రైతులకే ఉన్నది. మన పరిస్థితుల్లో మార్పుకోసం పోరాడటంతోపాటు దేశంలోని పరిస్థితులను కూడా మెరుగుపర్చేందుకు పోరాడాల్సిన బాధ్యత మనపై ఉన్నది. పోరాడితే మన వ్యవసాయరంగం బాగుపడుతుంది. ఇప్పుడు దేశాన్ని పాలిస్తున్న 14వ ప్రధానమంత్రికిగానీ, ఇప్పటివరకు పనిచేసిన వ్యవసాయ మంత్రులకుగానీ కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే రైతుల పరిస్థితి ఇలా ఉండేది కాదు’ అని సీఎం కేసీఆర్ విమర్శించారు.
తెలంగాణ అభివృద్ధిని చూడండి
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని స్వయంగా చూడాలని మహారాష్ట్ర నేతలను సీఎం కేసీఆర్ కోరారు. ‘నేడు ఇక్కడే ఉండండి, బస్సులు ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో ఏమేమి అభివృద్ధి జరిగిందో ఒక్కసారి చూసి రండి. చూస్తే నమ్మకం వస్తుంది. మంత్రి మీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. కాళేశ్వరం చూడండి. చెప్పింది, విన్నదానికన్నా చూస్తే బాగా అర్థమవుతుంది’ అని సూచించారు.