గద్వాల/గట్టు, నవంబర్ 27 : నామినేషన్ల ప్రక్రియ మొదలుకాగానే పలుచోట్ల సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఒక్క జోగుళాంబ గద్వాల జిల్లాలోనే వేలం ద్వారా మూడు జీపీలకు సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. గద్వాల మండలం కొండపల్లిలో వేలం వేయగా ముగ్గురు అభ్యర్థులు పోటీపడ్డారు. రూ.60 లక్షలకు సీడ్ కృష్ణారెడ్డి ఈ పదవిని దక్కించుకున్నాడు. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డి సర్పంచ్ పదవిని నేష శ్రీనివాసులు రూ.57 లక్షలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నట్టు గ్రామ పెద్దలు తీర్మానించారు.
విషయం తెలుసుకున్న అతడి భార్య అక్కడికి వచ్చి పదవి తీసుకుంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో శ్రీనివాసులు వేలం నుంచి విరమించుకున్నాడు. ఉప్పరి ఆంజనేయులు అదే మొత్తాన్ని తాను చెల్లిస్తానని ముందుకు రావడంతో సర్పంచ్ పదవి అతడికి అప్పగించాలని గ్రామపెద్దలు తీర్మానం చేసినట్టు తెలిసింది. కేటీదొడ్డి మండలం చింతలకుంట సర్పంచ్‌గా రాజశేఖర్‌ను గ్రామస్థులు తీర్మానించారు. ఇతను రూ.38.50 లక్షలకు వే లంలో దక్కించుకున్నట్టు తెలిసింది. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం మాన్సింగ్తండా ప్రజలు సర్పంచ్‌గా కొమురయ్యను ఏకగ్రీవంగా ప్రకటించారు.
హైదరాబాద్, నవంబర్ 27(నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా పెట్టింది. వేలం పాటలు, బెదిరించి నామినేషన్లు విత్‌డ్రా చేయించడం, తాయిలాలు ప్రకటించి ఏకగ్రీవాలు చేసుకోకుండా కొత్త విధివిధానాలు తీసుకొచ్చింది. ఎన్నికల ప్రక్రియతో పాటు ఏకగ్రీవాల విషయం లో అక్రమాలను నిరోధించేందుకు అత్యంత కఠిన చర్య లు ప్రకటించింది. తప్పనిసరి ధ్రువీకరణ విధానాన్ని అమలుచేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు గురువారం ఎస్ఈసీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.